ఓ సినిమా ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. ఎంత కష్టపడినా ఓ చిన్న మిస్టేక్ చాలు, సినిమా ఫ్లాప్ అవ్వడానికి. మైఖేల్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు హీరో సందీప్ కిషన్. ఓ నిర్మాత తనను ముందే హెచ్చరించాడని చెప్పుకొచ్చాడు.
“మైఖేల్ సినిమాను 90శాతం పెర్ ఫెక్ట్ గా ల్యాండ్ చేశాం. టీజర్, ట్రయిలర్ నుంచి ఏది రిలీజ్ చేసినా జనంలో అంచనాలు పెరిగాయి. షూటింగ్ నుంచే మేం కూడా చాలా ఎక్సయిట్ అయ్యాం. బాగా వస్తోందని అనుకున్నాం. రిలీజ్ కు ముందు ముగ్గురు నిర్మాతలు చూశారు. అందులో ఇద్దరు బ్లాక్ బస్టర్ అన్నారు. మరో నిర్మాత మాత్రం అస్సలు బాగాలేదు, ఏదో ఒకటి చేయమన్నాడు. నేను షాక్ అయ్యాను.”
మెజారిటీ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తను కూడా ముందుకెళ్లిపోయానని, అయితే ఆఖరి నిమిషంలో సినిమా చూసిన తర్వాత తేడా కొట్టిందనే విషయం తెలిసిందని అన్నాడు.
“అప్పటికి నేను సినిమా చూడలేదు. డబ్బింగ్ లో ఉన్నాను. ఆ తర్వాత ప్రచారంలో బిజీ అయ్యాను. విడుదలకు ముందు రోజు రాత్రి మాత్రమే సినిమా చూసే వెసులుబాటు దక్కింది. ఫస్ట్ 30 నిమిషాలు అదిరింది. ఆ తర్వాత కనెక్ట్ అవ్వలేదు, నాకే కథ అర్థం కావడం లేదు. మేం చెప్పాలనుకున్న స్టోరీ తెరపై కనిపించడం లేదు. ఎడిట్ లో తేడా కొట్టేసింది.”
ఇలా మైఖేల్ సినిమా పరాజయంపై స్పందించాడు సందీప్ కిషన్. ఆ రాత్రికి రాత్రి ఏదో చేయాలని ఆరాట పడ్డానని కానీ ఏం చేయలేకపోయామని తెలిపాడు. మర్నాడు పొద్దున్నే బాగా టెన్షన్ పడ్డానని, రిజల్ట్ తను ఊహించినట్టుగానే వచ్చిందని అన్నాడు. కనీసం 2 వారాల ముందు మైఖేల్ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.