ఏ రంగంలోనైనా నిర్ణీత కాలం వచ్చే సరికి ముగింపు పలకాల్సి వుంటుంది. జీవిత ముగింపే కాదు, వృత్తిపరమైన ముగింపు కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇది న్యాయమైంది కూడా. రాజకీయాల్లో ప్రజాభిమానం ఉండగానే, నిష్క్రమించాలని నాయకులు ఆకాంక్షిస్తుంటారు. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుని, ఛీ, థూ అని ఈసడిస్తున్నా కొందరు గబ్బిలాల మాదిరిగా రాజకీయాలను అంటిపెట్టుకుని వుంటారు.
ప్రస్తుతానికి వస్తే…. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబునాయుడిని చూస్తే జాలేస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన 75 ఏళ్ల చంద్రబాబునాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనే చెడ్డపేరును మూట కట్టుకున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ఎదుట నిలబడ్డట్టు, అలాగే అమిత్‌షాకు పాదాభివందనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవి ఫేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చంద్రబాబు రాజకీయ లొంగుబాటు… మోదీ, అమిత్‌షాలకు పాదాభివందనం చేయడం కంటే తక్కువేమీ కాదనే చర్చకు తెరలేచింది. రాజకీయాల్లో చంద్రబాబు వ్యక్తిత్వానికి ఓ బ్రాండ్ వుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లైనా పట్టుకుంటారనే పేరు సంపాదించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే మోదీ, అమిత్‌షాలపై చంద్రబాబు విమర్శలు ఇంకా తాజాగా ఉన్నాయి. చివరికి మోదీ భార్య గురించి కూడా బాబు ప్రస్తావనకు తెచ్చి, కుటుంబ బాంధవ్యాలు అంటే ఏంటో ప్రధానికి తెలియవని విమర్శించారు.
అమిత్‌షా, మోదీ ద్వయంపై ఎల్లో మీడియాలో నాడు ఎంత తీవ్రంగా వ్యతిరేక కథనాలు రాశారో అందరికీ తెలిసినవే. ఈ ఐదేళ్లలో చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా బలహీనపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఆయన రాజకీయంగా సొమ్ము చేసుకోలేకపోయారు. జగన్ వ్యతిరేకతపై మరోసారి అధికారంలోకి రావాలని ఆయన కలలు కంటున్నారే తప్ప, సొంత ఇమేజ్‌పై నమ్మకం లేదు.
అందుకే అధికారం కోసం జనసేనాని పవన్‌కల్యాణ్ లాంటి చిన్న దేవుడు మొదలుకుని, మోదీ, అమిత్‌షా తదితర పెద్ద దేవుళ్ల వరకూ ప్రసన్నం చేసుకోడానికి ఎక్కని గడప లేదు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే, భవిష్యత్ ఎలా వుంటుందో తలచుకుంటేనే ఆయనకు పీడకలలా వుంది. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్‌ను తలచుకుని ఆయన బెంబేలెత్తుతున్నారు. రాజకీయ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది.
ఈ కారణంగానే ఎవరి కాళ్లైనా పట్టుకోడానికి చంద్రబాబు సిద్ధమయ్యారనే అభిప్రాయాన్ని బలంగా ఏపీ ప్రజానీకం మనసులో ముద్ర వేయగలిగారు. బీజేపీ పెద్దలు ఛీ కొడుతున్నా… పాహిమాం పాహిమాం అని చంద్రబాబు వేడుకోవడం చూస్తున్న టీడీపీ శ్రేణుల్లో, ఇంతకంటే చావడమే మేలనేంత అసహనం. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతకామన్నదే ప్రధానం అని వారు అంటున్నారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి నేతలు భౌతికంగా మన మధ్య లేకపోయినా, జీవించిన కాలంలో వారు ప్రజల కోసం పని చేసిన తీరు ఇప్పటికీ చిరంజీవులుగా నిలిపిందని పలువురు గుర్తు చేస్తున్నారు. కానీ చంద్రబాబును లోకేశ్ తప్ప, లోకం గుర్తించుకునేలా ఏమీ చేయలేదనే అభిప్రాయం బలంగా వుంది. జీవితమంటే కేవలం అధికారం అనే ఏకైక లక్ష్యంతో ఎన్నెన్నో వంచనలు, కుట్రలకు పాల్పడ్డారని ఆయన గురించి బాగా తెలిసిన వారు కథలుకథలుగా చెబుతున్నారు.
ఇప్పుడు జీవితంతో పాటు రాజకీయ చరమాంకంలో కూడా అధికారం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకోడానికి బాబు రెడీ అయ్యారని, ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం చివరి రోజుల్లో అయినా కాస్త గౌరవంగా నిష్క్రమిస్తే చంద్రబాబుకే మంచిదని హితవు చెప్పేవారే ఎక్కువ.