ఆంధ్రప్రదేశ్‌లో అరసున్నా పార్టీ ఏదంటే… ఎవరైనా ఠకీమని బీజేపీ అని సమాధానం ఇస్తారు. గత ఎన్నికల్లో బీజేపీకి నోటా, కాంగ్రెస్ కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం అర్ధ శాతం ఓట్లతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని గుర్తించడం వల్లే, దానికి అథమ స్థానం కల్పించారు. అయితే కేంద్రంలో అధికారం చెలాయిస్తుండడం, ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో భయపెడుతుండడంతో, పార్టీలకు అతీతంగా నాయకులంతా ఆ పార్టీకి లొంగిపోయారు.
ఏపీలో అరసున్న పార్టీతో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఎన్నికల్లో మాత్రం బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోదు. టీడీపీ, జనసేన పార్టీలు ప్రస్తుతం బీజేపీతో సీట్ల పంపకాల్లో మునిగితేలాయి. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లగా, పవన్‌కల్యాణ్ నేడు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
పొత్తులో భాగంగా బీజేపీకి 15 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్ని టీడీపీ కేటాయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంతకంటే తక్కువకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని అంటున్నారు. ఎందుకంటే తమ దగ్గరికి టీడీపీ వచ్చిందే తప్ప, తాము వెళ్లి ప్రాధేయపడలేదనే వాస్తవాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరసున్న పార్టీకి అన్ని సీట్లు ఇస్తే, ఆరు లేదా అంత కంటే అర్ధశాతం ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగిన తమకెన్ని సీట్లు ఇస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
జనసేనకు 25 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల ప్రశ్న ఆలోచింప చేస్తోంది. బీజేపీకి ఇచ్చే సీట్లతో పోల్చుకుంటే, తమకు కనిష్టంగా 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి వుంటుందని జనసేన నేతలు అంటున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదని, అందుకే ఓట్ల బదిలీపై కాపు ఉద్యమ నాయకులు ఆందోళన చేస్తున్న విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.