ఒకప్పుడు చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. నాడు చాణక్యుడిగా పేరు పొందారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఆరితేరారని, ఆయన్ను ఢీకొట్టడం ఎవరి వల్లా కాదని రకరకాలుగా గొప్పలు చెప్పేవారు. బాబు అంటే గొప్ప విజనరీ అని, ట్రబుల్ షూటర్ అని ప్రశంసించేవారు. వెన్నుపోటుకు బాబు పర్యాయ పదం అనేది నాణేనికి రెండో వైపు.
ప్రస్తుతానికి వస్తే… చంద్రబాబు అంటే భయం, పిరికితనం. అందుకే బీజేపీకి ఆయన సాష్టాంగపడ్డారు. టీడీపీ శ్రేణుల అయిష్టానికి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో కనీసం ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి ఏకైక కారణం… చంద్రబాబును వెంటాడుతున్న భయమే. స్కిల్ స్కామ్‌లో 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఊచలు లెక్కపెట్టారు. చంద్రబాబును జైలుకు పంపడానికి వెనకున్న అదృశ్య శక్తి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీనే అని లోకం కోడై కూస్తోంది.
ఈ ప్రచారమే చంద్రబాబును మరింత భయపెడుతోంది. జరిగిపోయిన గతం కంటే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అనే భయం ఆయన్ను నీడలా వెంటాడుతోంది. జనసేనతో పొత్తు ఉన్నంత మాత్రాన అధికారంలోకి వస్తామన్న ధీమా ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదు. జగన్‌ను ఎదుర్కోవాలంటే… ఇంకా ఏదో కావాలనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు ఎన్నికల్లో రక్షణ కవచంగా పనికొస్తుందని ఆయన నమ్ముతున్నారు.
చంద్రబాబు రాజకీయ జీవితానుభవం 45 ఏళ్లు. ఆ అనుభవం కంటే కేవలం ఐదారేళ్ల వయసు ఎక్కువ ఉన్న వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌గా మారింది. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సీఎం పని అయిపోయిందని బహిరంగ సభల్లో రంకెలేసే చంద్రబాబు… ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా వస్తుందని విశ్వసించడం లేదు. అందుకే జనసేన, బీజేపీ… ఇంకా పరోక్షంగా అనేక పార్టీలతో అధికార, అనధికార పొత్తుల కోసం బాబు పరితపిస్తున్నారు.
బాబులో ఆవహించిన పిరికితనం చూసి, టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. చంద్రబాబుకు ఏమైంది? ఏపీలో కనీసం నామమాత్రంగా అయినా ప్రభావం చూపలేని బీజేపీతో పొత్తు కోసం ఎందుకింత వెంపర్లాట అని ప్రశ్నించే పరిస్థితి. స్కిల్ కేసుకే ఇంత భయపడితే, మరి సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు జైలుకెళ్లిన జగన్ మరెంతగా భయపడాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ ఒంటరిగా తలపడడానికి లేని భయం, బాబుకెందుకు? అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్ని వెంటాడుతోంది.
పైగా 2014 నాటి పరిస్థితులకు, ఇప్పటికి చాలా తేడా వుంది. ఏపీని విడగొట్టిన పార్టీగా కాంగ్రెస్‌పై నాడు రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన కోపం కనిపించింది. ఈ పదేళ్లలో విభజిత ఏపీకి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్న ఆగ్రహం రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. రాష్ట్రానికి అన్యాయం చేసిందనే విషయాన్ని పక్కన పెట్టినా, చంద్రబాబును అరెస్ట్ చేసింది జగన్ సర్కారే అయినా, చేయించింది మాత్రం మోదీ సర్కార్ అని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. బాబు అరెస్ట్‌తో మోదీ సర్కార్‌కు సంబంధం వుందంటూ ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అందుకే బీజేపీపై టీడీపీ శ్రేణుల్లో అదనపు కోపం.
ఇంతకాలం చంద్రబాబును చాణక్యుడితో పోల్చిన నోళ్లే, ఇప్పుడు పిరికోడని ఈసడించుకుంటున్నాయి. మంచో, చెడో జగన్ పులి అని ఆఫ్ ది రికార్డుగా టీడీపీ నేతలు కీర్తిస్తున్న పరిస్థితి. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని, పొత్తుల వరకూ జగన్ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజానికి జనసేనతో పొత్తు వుందని టీడీపీలో మెజార్టీ నేతల అభిప్రాయం. నిలకడలేని పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బందే అని టీడీపీ నాయకులు బాబుకు హితబోధ చేశారు. అయితే జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి, మళ్లీ జగనే అధికారంలోకి వస్తాడనే భయమే కలిసి పని చేయడానికి ప్రేరేపించింది.
జనసేనతో పొత్తు వల్ల ఏ మేరకు పరస్పర ఓట్ల బదిలీ జరుగుతుందో అనే అనుమానం ఇప్పుడు వెంటాడుతోంది. బాబు భయాన్ని చూస్తే… ఒకటే అనుమానం. రానున్న ఎన్నికల్లో ఒకవేళ అధికారంలోకి రాకపోయినా, జైలుకు వెళ్లకుండా కాపాడుకుంటే చాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే రాజకీయంగా నష్టపోవడానికి సైతం ఆయన వెనుకాడడం లేదు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే వుంటాయని చెబుతుంటారు. చంద్రబాబు విషయంలో రానున్న రోజుల్లో అదే చూడబోతున్నాం. విజయం అనేది ధైర్యపరుల్నే వరిస్తుంది. చంద్రబాబు లాంటి పిరికోడి చెంతకు విజయం వస్తుందనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి వుండదు.