విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ జనసేనలోకి జంప్ అయ్యారు. ఆయన జంప్ అవడానికి రీజన్ కూడా చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే పార్టీ మారుతున్నాను అన్నారు. ఆయనది విశాఖ తూర్పు నియోజకవర్గం. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు.
పొత్తులో భాగంగా ఆ సీటు ఎటూ దక్కదు. దాంతో విశాఖ సౌత్ నుంచి సర్దుబాటు చేస్తారు అని వినిపిస్తోంది. సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. దాంతో సౌత్ సీటుని జనసేన కోరుతోంది అంటున్నారు.
అయితే సౌత్ సీటుని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆశిస్తున్నారు. ఆయనకు గత ఎన్నికల్లోనే చంద్రబాబు సీటు హామీ ఇచ్చారు. పెందుర్తి పొత్తులో జనసేనకు ఇస్తారని ముందే అవగాహన ఉండడంతో ఆయనను సౌత్ కి టీడీపీ ఇంచార్జిగా నియమించారు. ఆయనతో పాటు మైనారిటీ నేతలు బీసీ నేతలు పలువురు సౌత్ సీటు మీద కన్నేశారు.
అందరిలో అంగబలం అర్ధబలం ఉన్న వారు గండి బాబ్జీ. ఆయన ఇప్పటికే టికెట్ తనదని ప్రకటించుకుంటున్నారు. ఆయన ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. సడెన్ గా ఈ సీటు జనసేనకు పొత్తులో ఇస్తే సౌత్ లో తమ్ముళ్ళు భగ్గుమనడం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా గండి బాబ్జీ కూడా సహకరించేది ఉండదని అంటున్నారు.
ఆయన 2014 తరువాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పట్లో వైసీపీలో ఉండేవారు. పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరారు. పదేళ్ల తరువాత ఆయనకు టీడీపీ విశాఖ సౌత్ సీటు చూపిస్తోంది.
ఇప్పుడు జనసేన వంశీ పోటీకి వస్తే ఆయన గెలుపునకు గండి కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. టీడీపీలో వర్గ పోరు వైసీపీకి వరంగా మారుతుందని అంటున్నారు. ఇప్పటికే సౌత్ లో వైసీపీ బలంగా ఉంది.