పొత్తు సరే.. టైమింగ్ బ్యాడ్ కదా?

2014 నాటి పొత్తులను రిపీట్ చేస్తే, 2014 నాటి ఫలితాలే రిపీట్ అవుతాయని బహుశా చంద్రబాబునాయుడు ఆశపడుతూ ఉండవచ్చు. అందుకే ఆయన 2019 ఎన్నికలకు ముందు.. తీవ్రంగా తిట్టిపోసిన భారతీయ జనతా పార్టీతో మళ్లీ…

2014 నాటి పొత్తులను రిపీట్ చేస్తే, 2014 నాటి ఫలితాలే రిపీట్ అవుతాయని బహుశా చంద్రబాబునాయుడు ఆశపడుతూ ఉండవచ్చు. అందుకే ఆయన 2019 ఎన్నికలకు ముందు.. తీవ్రంగా తిట్టిపోసిన భారతీయ జనతా పార్టీతో మళ్లీ కలవడానికి మంతనాలు ప్రారంభించారు.

ఇన్నాళ్లూ గుంభనంగా పవన్ కల్యాణ్ ద్వారా మూడు పార్టీల పొత్తలుకోసం రాయబారాలు నడిపిన చంద్రబాబు.. చివరికి తాను రంగంలోకి దిగారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి.. అమిత్ షా తోను, పార్టీ అద్యక్షుడు జెపి నడ్డాతోను భేటీ అయ్యారు.  ఎవ్వరూ ఎలాంటి ప్రకటన చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో వీరి భేటీ జరగడం గమనార్హం.

అయితే, భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణుల్లో చాలా భయాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబునాయుడు చీటికి మాటికి తన స్టాండ్ మార్చుకుంటూ తిట్టిన పార్టీనే తిరిగి వాటేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వారి భయం.

ఒకసారి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోడీ మోసం చేశారని తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత.. పెద్ద ధర్మపోరాటమే సాగించిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ వెళ్లి మోడీని ఆశ్రయించి ఆయన పొత్తుల్లో చేరడం అంటే.. ప్రత్యేకహోదా అంశాన్ని పూర్తిగా మంటగలిపేసినట్టేనని ప్రజలు గుర్తిస్తారనే భయం కూడా పార్టీలో ఉంది.

రామాలయం ప్రారంభం కారణంగా మోడీ వేవ్ దేశంలో మరింత పెరిగిందనేది చంద్రబాబుకు ఉన్న నమ్మకాల్లో  ఒకటి. అదే సమయంలో.. ముస్లిం సమాజంలో మోడీ పట్ల ద్వేషం, భారతీయ జనతా పార్టీ పట్ల ఆగ్రహం కూడా అంతే స్థాయిలో పెరిగాయనేది తెదేపా నాయకులు చెబుతున్నమాట. అయితే.. మోడీ వేవ్ ఉన్నంత మాత్రాన.. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడడం కష్టమేనని.. కానీ, ముస్లిం ఓట్లు మాత్రం ఒక్కటికూడా పడవని వారు భయపడుతున్నారు.

పవన్ కల్యాణ్ కూడా రకరకాల కారణాల వలన భాజపాతో పొత్తుకోసం ఎగబడుతున్నారు. పవన్ కల్యాణ్ లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబునాయుడుకు లేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో  రెండు పార్టీల ఆశావహులు, నాయకుల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. సరే.. ఏదో ఒక కారణాన భాజపాతో పొత్తుకు చంద్రబాబునాయుడు ఎగబడి వెళుతున్నారు సరే.. కానీ.. ఇంత ఆలస్యంగానా? అనేది పార్టీ నాయకుల ఆగ్రహానికి కారణం అవుతోంది.

ఇప్పటికే జనసేనతో పొత్తుల్లో దక్కే స్థానాల సంగతి తేల్చకుండా.. కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వకపోవడం వలన ప్రచారంలో వెనుకబడి ఉన్నాం అని వారికి భయం ఉంది. భాజపాతో చర్చలు ప్రారంభించిన టైమింగ్ ఇంకా దెబ్బతీస్తుందని అనుకుంటున్నారు.

ఇంత లేటుగా చర్చలు ప్రారంభిస్తే.. వారు సాగదీసి.. బేరాలను  ఒక పట్టాన తెగనివ్వకుండా.. ఎప్పటికి తేలుస్తారోనని.. ఈలోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల ప్రకటన మొత్తం పూర్తయిపోయి.. వారి అసంతృప్తుల సర్దుబాట్లు కూడా పూర్తయిపోయి ప్రచారంలో దూసుకెళ్లిపోతుంటారని భయపడుతున్నారు. కమలంతో పొత్తు చర్చలు ఆలస్యంగా ప్రారంభించినా సరే, వేగంగా ముగించాలని .. సీట్ల క్లారిటీ చాలా ముఖ్యం అని పార్టీ నేతలు అంటున్నారు.