భద్రత రచ్చతో బద్‌నాం చేయాలని..!

వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కటంటే ఒకటే ఎజెండాతో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి. ఆయన మీద ప్రజల్లో అపనమ్మకం పెంచాలి. వీలైనంత వరకు ఆయనకు ఓట్లు పడకుండా చూడాలి…

వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కటంటే ఒకటే ఎజెండాతో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి. ఆయన మీద ప్రజల్లో అపనమ్మకం పెంచాలి. వీలైనంత వరకు ఆయనకు ఓట్లు పడకుండా చూడాలి అనేది ఒక్కటే ఆమె స్థిరమైన ఎజెండాగా కనిపిస్తోంది.

ఇందుకు ఆమె ఇప్పటికే రకరకాల మాయోపాయాలు పన్నారు. నిందారోపణలు చేశారు. రకరకాల మార్గాలు అనుసరించారు. ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆమె తన భద్రత గురించి రాద్ధాంతం ప్రారంభించి.. జగన్ మీద జనంలో కోపం పుట్టించాలని చూస్తున్నారు.

వారు అడిగారు గనుక.. వైఎస్  షర్మిలకు ప్రభుత్వం భద్రత కల్పించాలట. ఆమెకు ఏ హోదా ఉన్నదని ఆమె భద్రత అడుగుతున్నారో అర్థం కావడం లేదు. ఆమె స్థాయి ఏమిటనుకుంటున్నారో తెలియడం లేదు. ఆమె కేవలం రాష్ట్రంలో నామమాత్రంగా మాత్రమే అస్తిత్వం కలిగి ఉన్న పార్టీకి అధ్యక్షురాలు అంతే.

కాంగ్రెస్ పార్టీకి నిన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుకు ఎలాంటి భద్రత కల్పించారో అంతకంటె భద్రత తగ్గిస్తే.. ఆమె ప్రభుత్వాన్ని నిందించాలి. లేదా, తెలంగాణలో ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వం నుంచి ఎలాంటి భద్రతను పొందిందో అంతకంటె తగ్గిస్తే ఆమె ప్రభుత్వాన్ని నిందించాలి. అంతే తప్ప.. ఇప్పుడు తనకు ఒక పార్టీ పదవి ఇచ్చిందని.. ప్రభుత్వం భద్రత ఇవ్వాలని వాదిస్తే ఎలా? అని ప్రజలు అనుకుంటున్నారు.

తనకు భద్రత కల్పించడం లేదు అంటే.. దాని అర్థం.. నాకు కీడు జరగాలని కోరుకుంటున్నట్టే కదా.. అని షర్మిల నింద వేస్తున్నారు. ప్రమాదాలు జరగడమే కాదు, ప్రమాదాలు చేయించేవాళ్లలో మీ వాళ్లు ఉంటారనే కదా.. అని అర్థం పర్థం లేని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదు.. షర్మిల ఏకైక ఎజెండా వెనుక ఉన్న ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకే రోజున అటు చంద్రబాబునాయుడుకు, ఇటు జగన్ కు ఆమె లేఖలు రాస్తే.. చంద్రబాబును తమలపాకుతో కొట్టినట్టుగానూ.. జగన్ ను మాత్రం తలుపు చెక్కతో నాలుగు బాదినట్టుగానూ సాగిన ఆమె వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ప్రత్యేకహోదా గురించి జగన్ మీద నిందలు వేస్తూ రకరకాల డైలాగులు వల్లిస్తున్న షర్మిల.. అసలు హోదా డిమాండ్ ను సర్వనాశనం చేసేసి, ఇప్పుడు మళ్లీ తగుదునమ్మా అంటూ బిజెపి పంచకు చేరుతున్న చంద్రబాబును పల్లెత్తు మాట అనడం చూస్తే.. అందరికీ క్లారిటీ వస్తోంది. ఇలాంటి ఎత్తుగడలు ఏవీ జనం ఎదుట వర్కవుట్ కాకపోవడంతో.. షర్మిల తన వ్యక్తిగత భద్రతకు ప్రమాదం అనే మాటల్ని జగన్ మీద సంధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.