గతంలో థియేటర్ కు సినిమా చూడ్డానికి వెళ్లడం గురించి.. ఎందుకు థియేటర్ కు వెళ్లడం.. కొన్నాళ్లాగితే టీవీలో వేస్తారు కదా.. అనే సెటైర్ ఒకటి మీడియాలో వచ్చేది! అయితే కొత్తగా విడుదలైన ఒక పెద్ద సినిమా కోసం అప్పట్లో టీవీలో చూడటం కోసం ప్రేక్షకుల కళ్లు కాయలు కాసేట్టుగా వేచి చూసేవారు! 2005 వరకూ ఈ పరిస్థితి ఉండేది. ఆ తర్వాత హిట్టైన సినిమాలు టీవీలో చూడాలంటే కూడా చాలా కాలమే వేచి చూడాల్సి వచ్చేది!
2005లో మా టీవీ వాళ్లు కొత్త సినిమాలను తొందరగా ప్రసారం చేయడం అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. అయితే విపరీతంగా యాడ్స్ ను గుమ్మరించి.. మాస్ వంటి సినిమాను ఐదారు గంటల పాటు ప్రసారం చేసి.. కామెడీ చేశారు. అప్పటికీ అదో ట్రెండ్!
అయితే సూపర్ హిట్ సినిమాలను టీవీలో చూడటం అంటే అదో పండగలాంటిది! వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలు తొలి సారి టీవీలో ప్రసారం అయినప్పుడు పల్లెల్లో జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు! ఓ మోస్తరు టౌన్లలో అప్పటికే ఇలాంటి సినిమాలను సిటీ కేబుల్ వాళ్లు అనధికారికంగా ప్రసారం చేసేసి.. డీవీడీలను అరగదీసే వారు! అలాంటి సిటీ కేబుళ్లు, డీవీడీలు లేని ఇళ్లు అప్పటికీ కోకొల్లలు కాబట్టి.. అప్పట్లో పెద్ద హీరోల సినిమాలు టీవీలో ప్రసారం కావడం ఏడాది లోపు ఎప్పుడైనా అదో పండగే!
మరి కాలం మారిపోయింది. ఇప్పుడు ఏ సినిమా కోసం టీవీల వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీల రాజ్యం నడుస్తోంది. మరి ఎంత ఓటీటీల రాజ్యం అయినా.. ఇప్పుడు ఓ మోస్తర్ హీరో సినిమా పక్షం రోజుల్లో ఓటీటీలోకి వస్తుంటే, స్టార్ హీరో తీసిన వంద కోట్ల బొమ్మ మూడు వారాలకు ఓటీటీలో విడుదలవుతోంది! సంక్రాంతి బొమ్మ శివరాత్రి వరకూ ఆగే పరిస్థితి లేదు ఓటీటీలో. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ కూడా ఓ నెలనాళ్ల లోపే జరిగిపోతోంది!
ఇది దీర్ఘకాలంలో పెద్ద హీరోల సినిమాలకు చేజేతులారా చేసుకుంటున్న డ్యామేజ్! కేవలం మూడు నాలుగు వారాలైనా గడవక ముందే ఇలా పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తే.. ఇక థియేటర్ కు వెళ్లే వాళ్లు మరింతగా తగ్గిపోతారు కూడా! ఎలాగూ థియేటర్ కు ఫ్యామిలీని తీసుకెళ్లి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి! సినిమా బాగుంటే ఓకే లేకపోతే అది ఇంకో టార్చర్. అలా డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆ సినిమాను మరీ మిస్ అయిపోతామనే ఫీలింగ్ ను ఓటీటీలు మరింతగా తగ్గించి వేస్తున్నాయి!
పెద్ద.. హీరో సినిమా కూడా మూడు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోందంటే.. ఇక పనిగట్టుకుని ఫ్యామిలీని థియేటర్ కు తీసుకెళ్లే వాళ్లు మరింతగా తగ్గుతారు! ప్రత్యేకించి గత ఐదారు నెలల్లో థియేటర్- ఓటీటీ విడుదలలకు మధ్య వ్యత్యాస సమయం పక్షం రోజులు, మూడు వారాల వరకూ తగ్గిపోయింది! ఇది హీరోల థియేటర్ మార్కెట్ ను కచ్చితంగా దెబ్బతీయబోయే అంశమే!