భారతీయ జనతా పార్టీని మడతెట్టుకురావడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారని ఆయన వీరాభిమాన వర్గం వీరావేశంతో అనుకుంటోంది! ఈ పొత్తులు అంతిమంగా చిత్తు చేస్తాయేమో అనే భయం కూడా తెలుగుదేశం వీరాభిమానవర్గంలోనే ఉంది! చంద్రబాబుదేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ల సిద్ధాంతం! ఇప్పుడు ఆయన అందరి కాళ్లనూ పట్టుకునే స్థితిలో ఉన్నారు! ఈ ప్రయత్నంతోనే ఆయన ఢిల్లీ లో బీజేపీతో పొత్తు కుదర్చుకుని వచ్చినా రావొచ్చు! బీజేపీ కూడా సిద్దాంతాలు, రాద్దాంతాలో ఏమీ లేదు! నితీస్ కుమార్ తో ఆ పార్టీ చేస్తున్న రంకు గురించి ఎంత చెప్పినా తక్కువే!
మరి నితీష్ ను సమ్మతిస్తున్న కమలం పార్టీ ఇదే మనసుతో తన మాజీ ప్రియుడు చంద్రబాబుతో పొత్తుకూ రెడీ కావొచ్చు! అయితే ఎంతైనా ఇప్పటి బీజేపీ 2014 నాటి బీజేపీ కాదు! అసలే రామమందిరం ఇమేజ్ తో తమ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయిందనే లెక్కలు కమలం పార్టీకి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలుగుదేశం నుంచి గట్టిగా ఎంపీ టికెట్ లను డిమాండ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తక్కువలో తక్కువ.. కనీసం పది ఎంపీ సీట్లను అడగడం బీజేపీకి గౌరవప్రదం అనిపించనూ వచ్చు! అసెంబ్లీలో కూడా తమ ఉనికి కావాలి కాబట్టి.. హీన పక్షం ఓ 15 అసెంబ్లీ సీట్లు బీజేపీ గౌరవప్రదం కోసం అడగొచ్చు! మరీ ఐదారు అసెంబ్లీ సీట్లకు ఒప్పుకుంటే బీజేపీ పరువు ఢిల్లీ లెవల్లో పోతుంది మరి!
ఎలాగూ బీజేపీతో పొత్తు కోసం బాగా ఆరాటపడుతున్నది చంద్రబాబు నాయుడే కాబట్టి.. 15 ఎమ్మెల్యే నియోజవర్గాలు, ఓ పది ఎంపీ నియోజకవర్గాలు తమ ఖాతాలో వేయమని చంద్రబాబుకు బీజేపీ హుకుం జారీ చేయొచ్చు! ఇప్పుడు ప్రాధేయ పడే స్థితిలో బీజేపీ లేదు, ఆర్డర్స్ ఇచ్చే స్థితిలో ఉంది! కాబట్టి.. బీజేపీ తన గౌరవం కోసం అడిగే సీట్లను చంద్రబాబు నాయుడు కేటాయించే పరిస్థితి ఉంది కూడా!
మరి ఇప్పటికే జనసేనకు బీజేపీ ఇచ్చేది కనీసం 25 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లు అనే ప్రచారం జరుగుతోంది. అదే చేత్తో బీజేపీకి పది ఎంపీ నియోజకవర్గాలను, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి తెలుగుదేశం సహకారం ఇస్తూ అక్కడ తన పార్టీ అభ్యర్థులను పక్కన పెట్టాల్సి వస్తే మాత్రం ఆ రచ్చ మామూలుగా ఉండదు! ఏకంగా 40 అసెంబ్లీ సీట్లు పదికి పైగా ఎంపీ సీట్లలో ఈ రచ్చ సాగితే.. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం లేని స్థితిలో తెలుగుదేశం రాజకీయం కుక్కలు చింపిన విస్తరి తరహాలో తయారు అవుతుందనడంలో వింత లేదు!