ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరు సీట్లను జనసేన పొత్తులో భాగంగా కోరుతోంది అని అంటున్నారు. ఈ జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు ఏజెన్సీలో ఉన్నాయి. మిగిలిన వాటిలో ఆరు సిటీ పరిధిలో ఉంటే ఏడు విశాఖ రూరల్ జిల్లాలో ఉన్నాయి.
పొత్తులో భాగంగా తమకు భీమునిపట్నం, విశాఖ దక్షిణం, గాజువాక. పెందుర్తి, ఏలమంచిలి. చోడవరం సీట్లతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు జనసేన కోరుతోంది అని అంటున్నారు. ఈ సీట్లలో జనసేన అభ్యర్ధులను కూడా ఖరారు చేసి పెట్టుకున్నారు అని తెలుస్తోంది.
భీమునిపట్నం నుంచి పంచకర్ల సందీప్, విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్, గాజువాక నుంచి పరుచూరి భాస్కరరావు, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ కుమార్, చోడవరం నుంచి శివశంకర్ లకు టికెట్లు ఇప్పించుకోవాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.
ఈ ఆరు సీట్లు కూడా టీడీపీకి బలమైనవి కావడం విశేషం. ఈ సీట్లలో టీడీపీ అనేక సార్లు గెలిచింది. ఇప్పటికి కూడా బలమైన నేతలు ఆయా నియోజకవర్గాలలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు సీట్లు ఆశిస్తున్నారు. అయితే టీడీపీ సీనియర్లకు బిగ్ షాక్ ఇచ్చేలా జనసేనకు ఈ సీట్లు ఇస్తారా అన్నదే తమ్ముళ్లకు టెన్షన్ పెడుతోందిట.
భీమునిపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలనుకుంటున్నారు అని అంటున్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. గాజువాక నుంచి టీడీపీ సీనియర్ నేత పల్లా ఉన్నారు. చోడవరం, ఎలమంచిలి తమ్ముళ్ళు సీట్లు ఆశిస్తున్నారు.
అయితే జనసేన మాత్రం ఈ సీట్లు కోరుతోంది. జనసేన కోరుతున్న ఈ సీట్లలో కాపులకు పెద్ద ఎత్తున బలం ఉంది. దాంతో ఈ సీట్లు ఇస్తే తాము సునాయాసంగా గెలుస్తామని జనసేన అంచనా వేసుకుంటోంది అని అంటున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ సీటుని మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ జనసేన తరఫున పోటీ చేసేందుకు ఆశిస్తున్నారు.