ప్రభాస్ చేస్తున్న మంచి క్రేజ్ వున్న సినిమా రాజా సాబ్. అన్నీ హై ఫై సినిమాలు చేస్తున్న ప్రభాస్ తో మారుతి తన మార్కు ఫ్యామిలీ, హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించబోతున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది.
ఇదే సంస్థ నిర్మించిన ఈగిల్ సినిమా విడుదల సందర్బంగా నిర్మాత విశ్వప్రసాద్ గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజా సాబ్ సినిమా ఈ ఏడాదే పూర్తవుతుందని ఆ తరువాత సరైన డేట్ చూసి విడుదల చేస్తామని అన్నారు. 2025 సంక్రాంతి బరిలోకి వస్తుందా? అని ప్రశ్నించగా, అప్పటి పరిస్థితులను బట్టి వుంటుందన్నారు.
ఎన్నికల తరువాత వీలును బట్టి, పవన్ కళ్యాణ్ డేట్ లు ఇస్తే సినిమా వుంటుందని అన్నారు. రాబోయే 15 నెలల్లో కాస్త చెప్పుకో దగ్గర సినిమాలు నాలుగైదు విడుదలవుతాయని చెప్పారు. మొత్తం ఎప్పటి నుంచో చేస్తున్న 15 సినిమాలు పూర్తి చేసి విడుదల చేయడం కూడా జరుగుతుందన్నారు.
పీపుల్స్ మీడియాను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నామని, తమకు సినిమాల కోసం అంటూ ఓ ఫిల్మ్ అకాడమీ కూడా స్టార్ట్ చేసామని, వివిధ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చి, తమ సంస్థలోకి తీసుకుంటామని అన్నారు.
సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతీ విభాగంలోనూ తాము వున్నామని, అలాగే థియేటర్ల విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నామని, జాతీయ స్థాయిలో సినిమాలు తీయాలన్నది టార్గెట్ అని విశ్వప్రసాద్ వివరించారు.
తాను కథలు విననని, ప్రాజెక్ట్ తన దగ్గరకు వచ్చిన తరువాత దాని జానర్, కాంబినేషన్, మార్కెట్, బడ్జెట్ ఇవి మాత్రం చూస్తానన్నారు. పెద్ద కాంబినేషన్ లు వచ్చినపుడు కథ కూడా అడగమని, నమ్మకంతో ముందుకు వెళ్లిపోతామని వివరించారు.
ఈగిల్ సినిమా స్టయిలిష్ గా వుంటుందని, అదే సమయంలో మాస్ గా కూడా వుంటుందని విశ్వప్రసాద్ చెప్పారు. ఈ సినిమాను స్వంతంగా విడుదల చేసుకుంటున్నామని, దాదాపు అన్ని సినిమాలు స్వంతంగానే విడుదల చేసుకుంటామని వెల్లడించారు.