బహుశా మీడియా సమావేశంలో ఇంత చక్కని కామెడీని ఎప్పుడూ ఆస్వాదించి వుండరు. వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజు కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి ప్రొద్దుటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రొద్దుటూరు టికెట్ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డికే అని ప్రకటించారు.
ప్రొద్దుటూరు టికెట్‌ను లింగారెడ్డి ఆశిస్తున్నారు. అయితే ప్రవీణ్‌రెడ్డే ప్రొద్దుటూరు అభ్యర్థి అని లోకేశ్ ఏడాది క్రితమే చెప్పారని శ్రీనివాస్‌రెడ్డి వ్యూహాత్మకంగా గుర్తు చేశారు. దీంతో లింగారెడ్డి నోర్మూయించినట్టైంది. దీన్ని జీర్ణించుకోలేని లింగారెడ్డి ఇవాళ మీడియా ముందుకొచ్చి అసలు విషయాన్ని పక్కన పెట్టి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మీడియా సమావేశంలో శివాలెత్తిన లింగారెడ్డి హావభావాలు, మాట్లాడిన అంశాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పించడం విశేషం. వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డికే టికెట్ అంటూ ఏదో చానల్‌లో బ్రేకింగ్ న్యూస్ రావడాన్ని లింగారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. తన పక్కన మరో ఇద్దరు టీడీపీ నాయకుల్ని కూచోపెట్టుకుని వరదరాజులరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డికి టీడీపీతో ఏం సంబంధమని లింగారెడ్డి నిలదీశారు. టీడీపీలో లేకుండా పార్టీ కండువాను, గుర్తును, జెండాను కబ్జా చేస్తున్నారా? అని లింగారెడ్డి నిలదీశారు. ఇలాగైతే తామేం కావాలని ఆయన ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుని సర్వం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద లేదా ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే తాము నక్సలైట్లలో చేరడమా? లేక రుషికేశ్, హరిద్వార్, లేదా ఏదైనా దర్గాకు పోయి సన్యాసం తీసుకోవాల్సిందే అని ఆయన తీవ్ర ఆవేదన, ఆవేశంతో కూడిన స్వరంతో అన్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీలోకి వెళ్లడం వరదరాజులరెడ్డి నైజం అని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలలు ఎక్కడున్నావని వరదను లింగారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, సీఎం రమేశ్‌లను కులం పేరుతో వరద తిట్టారని గుర్తు చేశారు. తెలుగుదేశం జెండా, కండువా వాడుకోడానికి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో అడుగు పెడితే ఓర్చుకునేది లేదని ఆయన హెచ్చరించడం గమనార్హం.
టీడీపీకి వరదరాజులరెడ్డి అవసరం లేదన్నారు. ఒకవేళ వరదరాజులరెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తే… వైసీపీకి 72వేల మెజార్టీతో గెలుస్తుందని ఆయన సంచలన ప్రకటన చేయడం విశేషం. లింగారెడ్డి వీరావేశంతో ఊగిపోతూ వరదను విమర్శించడం, నక్సలైట్లలో చేరడమా లేదా సన్యాసం తీసుకోవడమా? ఏదో ఒకటి జరుగుతుందనే కామెంట్స్ మీడియా ప్రతినిధులతో పాటు చూసిన ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పించాయి. అయితే టికెట్ ఇచ్చేది చంద్రబాబునాయుడనే వాస్తవాన్ని లింగారెడ్డి మరిచిపోయినట్టున్నారు. ఒకవేళ వరదకు టికెట్ ఇస్తే, ఆ తప్పు చంద్రబాబుదే అని విమర్శించడానికి ఆయనకు ధైర్యం లేకపోయింది.