హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణకు దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో చురకలు అంటించారు. బాలయ్య సినిమా షూటింగ్‌లు లేని సమయాల్లో మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుంటారు. అలాగే తన నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు.
ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలన్న కోరిక ఆయనలో బాగా పెరుగుతోంది. తన బావ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన బయట లేని లోటును భర్తీ చేస్తానని భారీ డైలాగ్‌లు బాలయ్య చెప్పారు. బాలయ్యకు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి, మొగ్గ దశలోనే ఆయన కోరికను నాయకులు తుంచేశారు.
దీంతో ఆయన మౌనం పాటించారు. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. సమావేశాలు జరగకుండా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. మరోవైపు వైసీపీ సభ్యుడు అబ్బయ్య చౌదరి ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలయ్య వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీడీపీకి కుర్చీ మీద వ్యామోహం అని విమర్శించారు. అందుకే స్పీకర్ కుర్చీ దగ్గరికి టీడీపీ సభ్యులు వెళ్తున్నారని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న ఈజీ కాదు.. ఇప్పుడు కుర్చీ తీసుకోవడం అని ఆయన దెప్పి పొడిచారు. తొడ గొడితే కుర్చీలు రావడానికి ఇది సినిమా కాదని బాలయ్యకు అబ్బయ్య చౌదరి చురకలు అంటించడం విశేషం.