ప్రత్యర్థులకు చురకలు అంటించడంలో మాజీ మంత్రి పేర్ని నాని తర్వాతే ఎవరైనా. పేర్ని నానిపై విమర్శలు చేసే వాళ్లు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సి వుంటుంది. లేదంటే నాని సెటైర్స్‌కు ఎవరైనా విలవిలలాడాల్సిందే. తాజాగా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, షర్మిలకు పేర్ని నాని చురకలు అంటించారు.
మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ జనంలోకి జగన్ వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని విమర్శించారు. 2014లో టీడీపీ-జనసేన ఉమ్మడిగా ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా నెరవేర్చాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళుతున్నారని ఆయన నిలదీశారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ వెంపర్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
ఈ సందర్భంగా చేగొండి హరిరామజోగయ్య లేఖలోని విషయాలను నాని ప్రస్తావించారు. జగన్‌ను గద్దె దించడం అంటే చంద్రబాబును సీఎం చేయడం కాదని కాపు ఉద్యమ నాయకుడు చేగొండి నిలదీశారన్నారు. ఇది వైసీపీ అన్న మాట కాదన్నారు. చెల్లిని తిడుతున్న వాళ్లకు జగన్ అండగా నిలిచారనే పవన్ కామెంట్స్‌ను ఆయన తప్పు పట్టారు. మానవ సంబంధాల గురించి పవన్ మాట్లాడ్డం హాస్యాస్పదమన్నారు.
అన్న శత్రువులతో షర్మిల చేతులు కలిపారని పేర్ని నాని విమర్శించారు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని విమర్శించిన వ్యక్తే నేడు అదే పార్టీ జెండా మోస్తున్నారని షర్మిలకు చురకలంటించారు. గతంలో తన తల్లిని తిట్టారని, తిట్టించారని టీడీపీ నేతలపై పవన్ విమర్శలు చేయడాన్ని పేర్ని గుర్తు చేశారు. నేడు తల్లిని తిట్టిన పార్టీ పల్లకీని పవన్ మోస్తున్నాడని పేర్ని చీవాట్లు పెట్టారు.
2004 నుంచి జగన్ గురించి మొత్తం తెలుసని అంటున్న బాలశౌరి, చెడ్డవాడని తెలిస్తే వైసీపీలోకి ఎందుకు వచ్చావని పేర్ని నిలదీశారు. ఢిల్లీలో 2019లో ఒక రోజు రాత్రి కేవీపీ దగ్గర జగన్ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడావో తెలియదని అనుకుంటున్నావా? అని బాలశౌరిని పేర్ని నాని ప్రశ్నించారు.