నాయకులకు ప్రజల ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉండాలా? లేదా, వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల పట్ల మాత్రమే మక్కువ ఉండాలా? అందరు నాయకులు ఒకే తీరుగా ఉండాలని మనం అశించలేము.
కోట్లు ఖర్చు పెట్టిన నాయకులు, ముందు ఆ పెట్టుబడి వెనక్కు తీయడం మీద మాత్రమే దృష్టి పెడతారు. అధికారం అనుభవించడం కోసం, మౌనాన్ని ముసుగుగా వేసుకుని.. అధికారం మొత్తం మురిసిపోతున్న తరుణంలో పతివ్రత కబుర్లు చెబితే మాత్రం.. ఆ నాయకుల పట్ల చీదర పుడుతుంది. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను చూస్తే అలాగే అనిపిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ తొలి నుంచి అసంతృప్తితో వేగిపోతూ ఉన్న నాయకుడు ఆయన. మంత్రి పదవి కావాలని కోరిక. ఆ కోరికను జగన్ తీర్చలేదని అలక. ఎప్పుడూ ఏదో ఒక రకంగా పార్టీని చికాకు పెడుతూనే ఆయన మొత్తం అయిదు సంవత్సరాలు నెట్టేశారు. జగన్ పిలిచి పార్టీ పరిస్థితులను వివరించి, ఎన్నిసార్లు బుజ్జగించడానికి ప్రయత్నించినా మారని తీరు ఆయన సొంతం. ఇలాంటి నాయకుడు ఇప్పుడు జగన్ మీద నిందలు వేయడానికి అమరావతిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు ఆయన వచ్చి అమరావతి గురించి అడిగితే.. నేను ఇల్లు కూడా కట్టుకున్నా కదా.. రాజధాని ఇక్కడే ఉంటుంది.. అని జగన్ చెప్పారట. గెలిచిన తర్వాత మాట మార్చారట. అమరావతి నుంచి రాజధానిని మారిస్తే పార్టీకి చాలా నష్టం అని ఆయన ముందుగానే హెచ్చరించారుట. కనీసం సెక్రటేరియట్ ను ఇక్కడే ఉంచమని కోరినా జగన్ పట్టించు కోలేదట.
కాబట్టి, ఇప్పుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా అని వసంత అంటున్నారు. పదవి అవసాన దశలో ఈ వృద్ధ నారీ పతివ్రత డైలాగులు వేయకపోతే.. అప్పుడే రాజీనామా చేసి తప్పుకుని ఉంటే కనీసం అమరావతి కోసం త్యాగం చేసిన మంచి పేరు ఉండేది కదా.. అని జనం పెదవి విరుస్తున్నారు.
ఒకవైపు రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటూనే.. మరోవైపు కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి డిసైడ్ చేస్తానని అనడం వసంతలోని అవకాశవాద వైఖరికి నిదర్శనం అని పలువురు ఆక్షేపిస్తున్నారు.