Advertisement

Advertisement


Home > Politics - Opinion

రామోజీ ప‌త్రిక క‌థ‌నం నిర‌ర్థ‌కంః జ‌గ‌న్‌కు ఫుల్ మార్క్స్!

రామోజీ ప‌త్రిక క‌థ‌నం నిర‌ర్థ‌కంః జ‌గ‌న్‌కు ఫుల్ మార్క్స్!

హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని సంకల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) దేశ వ్యాప్తంగా వున్న మఠాధిపతులను, పీఠాధిపతులను ఆహ్వానించి తిరుమలలో మూడు రోజుల పాటు ధార్మిక సదస్సు నిర్వహించింది. ధర్మ ప్రచారానికి చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీల సూచనలు, సలహాలు స్వీకరించాలన్నది ఈ సదస్సు ఉద్దేశం.

ఇదే సమయంలోనే, ఓ ప్రముఖ దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఉన్న తన కోపాన్ని స్వామీజీలలోనూ ప్రేరేపించి, జగన్‌ ప్రభుత్వాన్ని తబ్బుబట్టించి, తద్వారా తాను సమర్ధిస్తున్న రాజకీయ పక్షానికి లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతో ‘భక్తుల మనోభావాలపై జగన్‌ గొడ్డలి వేటు’ అంటూ ముప్పావు పేజీ కథనాన్ని ప్రచురించింది.

‘దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో కనపడతాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రలో నమోదయ్యాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్‌రెడ్డి - దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు పాల్పడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠను దెబ్బతీశారు. మాట్లాడితే ‘‘దేవుడి దయ’’ అనే జగన్‌ - శ్రీరామచంద్రమూర్తి విగ్రహ విధ్వంసకులను వదిలేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు’ ఇదీ కథనానికి సూపర్‌ లీడ్‌.  

ఏవేవో చిన్నా చితకా ఘటనలు, వివాదాలను ఒకచోటికి చేర్చి, జగన్‌ హిందూ మత వ్యతిరేకి అనే భావనను కలిగించే ప్రయత్నం చేసింది. తద్వారా తిరుమల ధార్మిక సదస్సులో పాల్గొనే సాధుసంతుల ఆలోచనల్లో జగన్‌ వ్యతిరేకతను పెంచడమే అనేది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతోంది.

అయితే, తిరుమలలో జరిగింది వేరుగా వుంది. సదస్సులో తొలిరోజు 24 మంది,  మరుసటి రోజు 17 మంది పీఠాధిపతులు స్వయంగా పాల్గొన్నారు. 16 మంది వర్చువల్‌గా తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. మొత్తంగా 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో ఈ సదస్సులో మాట్లాడారు.

ఒకరంటే ఒకరు కూడా జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పైగా జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించారు కూడా. ఓ పీఠాధిపతి నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ, ఆయన ఏ మఠానికి ఎంత భూములు కేటాయించింది, హిందూ ధర్మోద్ధరణకు ఎంత చేసిందీ ప్రస్తావించి అభినందనలు తెలియజేశారు.

సదస్సు నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా పీఠాధిపతులు ఎంతగానో ప్రశంసించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మూడు వేలకుపైగా ఆలయాలు నిర్మించడం, గుడికో గోవు వంటి కార్యక్రమాలు చేపట్టడంపై ప్రత్యేకంగా అభినందించారు. గోవింద కోటి రాసిన భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని, శ్రీవారి ఆశీస్సులు పొందిన బంగారు మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భూమన కరుణాకర్‌ రెడ్డి ఛైర్మన్‌ అయిన తరువాత తీసుకున్న నిర్ణయాలను పలువురు పీఠాధిపతులు మెచ్చుకున్నారు. తిరుపతి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా నిర్మించిన కొత్త రహదారులకు ఆధ్యాత్మిక మహాపురుషుల పేర్లు పెట్టడంపై కూడా భూమనను పలువురు అభినందించారు.

హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి చేస్తున్న కృషిని, ప్రభుత్వ సహకారానికి పీఠాధిపతులంతా ఏకకంఠంతో జయహో అన్నారు. ఎక్కడా చిన్నపాటి విమర్శ కూడా చేయలేదు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం పెరిగిందని, ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని కూడా కొనియాడటం విశేషం.

ఆ పత్రిక చెప్పినట్లు జగన్‌ నిజంగా రాక్షస వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే పీఠాధిపతుల నుంచి ఇటువంటి ప్రశంసలు ఎలా వస్తాయన్నది ప్రశ్న. రాజకీయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి మీద విమర్శలు ఆరోపణలు చేయవచ్చుగానీ, ఆయనేదో హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేసి, తాము నమ్మిన వారికి, తాము నమ్ముకున్నవారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకోవడం సమంజసం కాదు.

- ఆదిమూలం శేఖర్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?