అదే మరి కాంగ్రెస్ పార్టీ అంటే..!

కాంగ్రెసు పార్టీలో ఎన్ని చిత్రాలు అయినా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కే అవకాశం కూడా లేదని తెలిసినా.. ఇప్నుడు ఎక్కడా ఠికానా లేని నాయకులు కాంగ్రెసు వైపు ఎగబడుతున్నారు.…

కాంగ్రెసు పార్టీలో ఎన్ని చిత్రాలు అయినా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కే అవకాశం కూడా లేదని తెలిసినా.. ఇప్నుడు ఎక్కడా ఠికానా లేని నాయకులు కాంగ్రెసు వైపు ఎగబడుతున్నారు. అదే మాదిరి ఇంకో చిత్రం తెలంగాణలో చోటుచేసుకుంటోంది. ఇక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది. ఎంపీ ఎన్నికల్లో కూడా గత ఎన్నికల కంటె మెరుగైన ఫలితాలు సాధించగలం అనే విశ్వాసంతోనూ ఉంది. అయితే ఈ విశ్వాసంలో అతి విశ్వాసం చాలా మంది పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

ఎమ్మెల్యే టికెట్లకు అప్లికేషన్లు వేయడానికి కూడా ఒక ధర నిర్ణయించారు. ఇప్పుడు ఎంపీ టికెట్లకు దరఖాస్తు చేసుకునే వంతు వచ్చింది. ఆ పర్వం పూర్తయింది కూడా. అధికారంలో ఉన్న పార్టీ గనుక సహజంగానే చాలా మంది నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో శాస్త్రోక్తమైన దరఖాస్తుల వడపోత జరగబోతోంది. మొత్తం 17 స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చాయి.

ఇక్కడే ఒక ట్విస్టు తెరమీదకు వస్తోంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులే ప్రామాణికం కాదని, గెలిచే సత్తా ఉన్నవారు.. దరఖాస్తు చేయకపోయినా ఎంపిక చేయాలని స్క్రీనింగ్ కమిటీకి అధిష్టానం నిర్దేశించినట్లు పీసీసీ నేత ఒకరు తెలియజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక్కడే ఉంది అసలు మతలబు. దరఖాస్తు చేయడం ద్వారా తమ ప్రయత్నం బయటపడకుండా చూసుకుంటూ.. దొడ్డిదారిలో ఢిల్లీ పెద్దలను మెప్పించి టికెట్ తెచ్చుకోగలమనే నమ్మకంతోనే పలువురు నాయకులు చెలరేగుతున్నారు. ఇలా దరఖాస్తు చేయని ఆశావహుల్లోనే కీలకమైన నేతలు ఉండడం విశేషం.

నల్గొండ, భువనగిరి ఎంపీ నియోజకవర్గాలకు దరఖాస్తు చేయకుండానే టికెటు ఇప్పించుకోవడానికి, ఆ రూపంలో తమ వారసుల్ని బరిలోకి దించడానికి ఇద్దరు కీలక నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు ఎటూ దరఖాస్తు చేయనేచేశారు. ఖమ్మం ఎంపీ స్థానానికి మల్లు భట్టి విక్రమార్క భార్య దరఖాస్తు చేసినప్పటికీ.. ఆ సీటు మీ ఆశలున్న, అక్కడ తమ వారసుల్ని దించాలనుకుంటున్న ఇతర నాయకులు.. దరఖాస్తు లేకుండానే తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఈ రకంగా.. దరఖాస్తు చేయడం అనేది కేవలం ఒక ప్రహసనంగా మారుతోంది. అందుకే దానిని కాంగ్రెసు పార్టీ సంస్కతి అంటారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.