జనసేన సీట్లపై ఎల్లో మీడియా కథనాలపై కాపుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరీ అధ్వానంగా 20, 25 అసెంబ్లీ సీట్లే జనసేనకు ఇస్తారనడాన్ని కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికీ జనసేనకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వెన్నుపోటు పొడవడంగా ఆ పార్టీ శ్రేణులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపులతో పాటు జనసేన శ్రేణుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని మాజీ మంత్రి, పవన్ సామాజిక వర్గానికి చెందిన కురు వృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. ఆ లేఖలో పవన్‌ను ఆయన నిలదీయడం గమనార్హం. లేఖలో సారాంశం ఏంటో తెలుసుకుందాం.
“చంద్రబాబుతో పవన్ భేటీ నేపథ్యంలో ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు 30 సీట్లని, ఒక ఎల్లో వార్తా పత్రిక 27 సీట్లని పేర్కొన్నాయి. ఈ రకమైన ఏకపక్ష వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించటానికోరో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలి.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా అగ్రవర్ణాలలో 6 శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప, 80 శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాలు వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించలేదు. అయితే వైఎస్ జగన్‌ను సీఎం పీఠంపై నుంచి గద్దె దించాలంటే ఇష్టం ఉన్నా, లేకపోయినా టీడీపీతో జత కట్టాల్సిన అనివార్య పరిస్థితి జనసేనది. అలాగని వైసీపీని గద్దె దించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. ఈ ఆలోచనలతో కాదు కదా పవన్‌తో కాపు సామాజిక వర్గం ప్రయాణిస్తున్నది.
జనసేన మద్దతు లేకుండా అధికారానికి కావాల్సిన మెజార్టీ సీట్లను టీడీపీ దక్కించుకోవడం కష్టమని గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఒంటరిగా వెళితే టీడీపీ విజయం సాధించడం జరిగేది కాదనేది సుస్పష్టం. ఈ పరిస్థితిలో జనసేనకు టీడీపీ సీట్లు కేటాయించే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేదే ప్రశ్న కావాలి. సామాజిక న్యాయమే ధ్యేయంగా 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీనవర్గాలు, 25 శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేదే ప్రశ్న కావాలి.
2019 ఎన్నికలలో శాసనసభా సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజికవర్గం వారు 31 మంది ఉన్నారు. ప్రస్తుతం మెజారిటీ జనాభా ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాపు సామాజికవర్గం ఎన్ని సీట్లు జనసేన, తెలుగుదేశం అభ్యర్థులుగా దక్కించుకోగల్గుతున్నారనేదే ప్రశ్న. 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిజ సామాజికవర్గం, అధిక సంఖ్యలో జనాభా కల్లిన తూర్పుకాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగల్గింది అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలి.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యాకులు పవన్ వెంట నడుస్తున్నారు. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగల్గితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం.
తనకు పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అప్పుడప్పుడు పవన్ అంటుంటారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగల్గుతారు అని జన సైనికులు అడిగే ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెబుతారు? ఎలా సమర్ధించుకుంటారు? జన సైనికులు సంతృప్తి పడేలా, సీట్లు పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలో మీకు రెండున్నరేళ్లు కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే మీరు చంద్రబాబుతో ప్రకటించగల్గుతారా?
ఈ ప్రశ్నలకు మీ నుంచి జన సైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు వస్తేనే ఎన్నికలంతా సవ్యంగా జరుగుతాయి. జనసేనకు సీట్ల కేటాయింపు 40 నుంచి 50 తక్కువ కాకుండా జరక్కపోయినా, కాపు సామాజిక వర్గానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరక్కపోయినా ఓట్ల బదిలీ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉంది. దీనికి మీ ఇద్దరు మాత్రమే కారణం అవుతారని విశ్వసిస్తూ విశ్లేషించాల్సి వస్తోంది” అని కఠిన వాస్తవాలను ఆయన రాస్తూనే, చివరిగా క్షమాపణ కోరడం గమనార్హం.
ఇటీవల కాలంలో చేగొండి హరిరామ జోగయ్య పదేపదే ఓట్ల బదిలీ సవ్యంగా సాగదంటూ పవన్‌ను హెచ్చరిస్తున్నారు. చేగొండి విశ్లేషణలో ధర్మాగ్రహం కనిపిస్తోంది. చంద్రబాబు కోసం తనను నమ్ముకున్నోళ్లందరి గొంతులు పవన్ కోస్తున్నారనే ఆవేదన కనిపిస్తోంది.