రానురాను విమానంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం వారానికో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజా ఘటన అలాంటిదే. ఈసారి ఏకంగా లైంగిక వేధింపుల మేటర్ అది.
26 ఏళ్ల మహిళ తన ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి కోల్ కతాలో స్పైస్ జెట్ విమానం ఎక్కింది. సీట్లు పక్కపక్కన రాకపోవడంతో.. ఇద్దరు ముందు కూర్చున్నారు, వాళ్ల వెనక ఈ యువతి కూర్చుంది. ఆమె పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు.
సీట్లో కూర్చున్న తర్వాత ఎవరో తనను నొక్కుతున్నట్టు భావించింది సదరు యువతి. అయితే చిన్న సీట్లు కావడంతో సర్దుబాటు కోసం అలా జరిగి ఉంటుందని భావించారు. ఆ తర్వాత పక్కనున్న ప్రయాణికుడు ఆమె తొడలపై రుద్దాడట. అక్కడితో ఆగకుండా ఓ అసభ్యకరమైన భంగిమలో తిరిగాడట. దీంతో యువతి వెంటనే రియాక్ట్ అయింది. లేచి తోటి ప్రయాణికుడి చెంప ఛెళ్లుమనిపించింది.
వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. గమ్యస్థానానికి చేరిన వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విమాన సిబ్బంది యువతికి సర్దిచెప్పారు. పాడుపని చేసిన వ్యక్తితో క్షమాపణలు చెప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో విమాన సిబ్బంది తప్పు చేసినట్టు సదరు యువతి ఆరోపిస్తోంది. కనీసం ఆ వ్యక్తి నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకోకుండా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తోంది. జరిగిన ఘటనపై స్పైస్ జెట్ సరైన పద్ధతిలో స్పందించలేదని ఆరోపిస్తోంది యువతి. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కోల్ కతాకు చెందిన 50 ఏళ్ల లాయర్ గా చెబుతున్నారు.