ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ ఒక పక్కన అలాగే సాగుతోంది. ఒక పట్టాన తెమలడం లేదు. ఇప్పటిదాకా చూస్తూంటే చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించారు. పవన్ కూడా మాకూ వత్తిళ్ళు ఉన్నాయంటూ తానూ రెండు సీట్లు ప్రకటించారు. దాని మీద మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ వేస్తూ టిట్ ఫర్ టాట్ అని హాట్ కామెంట్స్ కూడా చేశారు.
అయితే ఈ విషయంలో టీడీపీ పెద్దగా రెస్పాండ్ కాకుండా లైట్ తీసుకుంది. ఇలా చెరి రెండు సీట్లూ రెండు పార్టీలు ప్రకటించడం కూడా ముందే అనుకుని చేస్తున్నారు అన్న ప్రచారానికి కూడా తెర లేచింది. దీని మీదనే పాయింట్ పట్టుకుని వైసీపీ గట్టిగా నొక్కుతోంది.
చంద్రబాబు రెండు సీట్లు అంటే పవన్ రెండు సీట్లు అన్నారు. బాగానే ఉంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ప్రకటిస్తే అన్ని సీట్లూ జనసేన తరఫున ప్రకటించడానికి పవన్ సిద్ధమా అని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇది కచ్చితమైన సవాల్ అని దీనిని పవన్ స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ మీద ఆయన ఈ విధంగా సెటైర్లు వేశారు.
తాను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్న దాని మీద గుడివాడ అమర్నాథ్ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. అందరికీ దేవుడు నుదిటి మీద రాత రాస్తే తన నుదిటి మీద జగన్ తలరాత రాస్తారు అన్నారు. జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు.
ఒకవేళ పోటీకి సీటు ఇవ్వకపోయినా తాను పార్టీ జెండా పట్టుకుని పనిచేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. జగన్ మరోసారి సీఎం కావాలన్నదే తన లక్ష్యమని గుడివాడ చెప్పారు. పార్టీ కోసం తాను ఉన్నానని జగన్ ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పనిచేస్తాను అని ఆయన అంటున్నారు.