టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ ఏపీలో పలు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రెండవ విడత పర్యటనలు ఈ నెల 5 నుంచి మొదలెడుతున్నారు. గత పదేళ్లుగా గెలవని మాడుగులలో సభను వ్యూహాత్మకంగా పెట్టడం ద్వారా బాబు అక్కడ సైకిల్ జోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటన నేపధ్యంలో ఆశావహులు హడావుడి ఎక్కువగా ఉంది. బాబు కళ్లలో పడి టికెట్ ఖరారు చేసుకోవాలని ఎవరు ప్రయత్నాలలో వారు ఉన్నారు. టీడీపీలో ఇద్దరు మాజీ మంత్రులు బాబు ప్రసన్నం కోసం చేస్తున్న యత్నాలు ఆసక్తిగా ఉన్నాయి.
టీడీపీలో చాలా కాలం ఉండి బయటకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయారు. ఆయన తన కుమారుడి కోసమే గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారు. చట్ట సభలో కుమారుడిని కూర్చోబెట్టాలన్నది దాడి తాపత్రయం.
వైసీపీ దాడి కుమారుడికి 2014లో టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. 2019లో టికెట్ లేదని చెప్పేసింది. 2024లో కూడా ఇవ్వకపోవడంతో అలిగి టీడీపీ వైపు దాడి కుటుంబం వచ్చేసింది. టీడీపీలో అనకాపల్లి సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. ఆ సీటు ఎటూ దక్కదు. దాంతో మాడుగుల మీద దాడి ఫ్యామిలీ కన్నేసింది అని అంటున్నారు.
మాడుగులలో టికెట్ ఇస్తే ఈసారి టీడీపీని గెలిపించుకుని వస్తామని బాబుతో గట్టిగా చెప్పనుంది అని ప్రచారం సాగుతోంది. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా తన కుమారుడి రాజకీయ ఎంట్రీ కోసమే పట్టుదలగా పనిచేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సీటు తన కుమారుడికి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ పెడుతున్నారు.
సీనియర్ నేతగా తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అని ఆయన అంటున్నారు. చంద్రబాబు రాక నేపధ్యంలో అయ్యన్న అనుచరులు కూడా అనకాపల్లి ఎంపీ సీటు అయ్యన్న కుమారుడికి ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుతున్నారు.
ఇలా ఇద్దరు మాజీ మంత్రులు తన కుమారుల ఫ్యూచర్ ని బాబు ముందు పెట్టేశారు. చంద్రబాబు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన మాత్రం సరైన టైం లో సరైన నిర్ణయం తీసుకుంటారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి.