చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ భేటీలో టీడీపీ యువ నాయకుడు లోకేశ్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోకేశ్‌పై పవన్‌తో సహా జనసేన నాయకులు, కార్యకర్తలు కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి చంద్రబాబునాయుడే సీఎం అని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా? వద్దా? అనే విషయమై అందరూ చర్చించుకుని నిర్ణయిస్తారని లోకేశ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇటీవల లోకేశ్ అన్న మాటల్ని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన మధ్య సీట్లు, నియోజక వర్గాల పంపిణీపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కీలక చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లి సీట్లపై పట్టు పట్టినట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఈ భేటీలో కేవలం చంద్రబాబు, పవన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. లోకేశ్ లేకపోవడం చర్చకు దారి తీసింది. టీడీపీకి సంబంధించి ప్రతి నిర్ణయంలోనూ లోకేశ్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా పవన్, చంద్రబాబు మధ్య సీట్లు, నియోజక వర్గాలకు సంబంధించి చివరి విడత చర్చలని అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం వున్న భేటీలో లోకేశ్ పాల్గొనకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తింది.
లోకేశ్‌ను పక్కన పెట్టడానికి కారణాలేంటనే చర్చ నడుస్తోంది. తమ మధ్యలో లోకేశ్ ఉండకూడని చంద్రబాబుకు పవన్ షరతు పెట్టారా? అనే అనుమానం తలెత్తింది. జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇవ్వాలనే విషయమై చంద్రబాబు, లోకేశ్ మధ్య ముందే పలు దఫాలు చర్చలు జరిగినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఏ నిర్ణయమైనా లోకేశ్‌కు తెలియకుండా చంద్రబాబు తీసుకోరని టీడీపీ నేతలు అంటున్నారు. బాబు, పవన్ భేటీలో లోకేశ్ అవసరం లేదు కాబట్టి ఆయన పాల్గొని వుండకపోవచ్చని టీడీపీ నేతలు తెలిపారు.