మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఇవాళ నోరు విప్పారు. ఇందుకు హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదిక కేంద్రమైంది. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సత్కార సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వెండితెరపై తన హీరోయిజంతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి, రాజకీయ తెరపై కూడా అదే రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009లో జరిగిన ఎన్నికల్లో తలపడ్డారు. ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలనే ఆయన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.
పరిమిత సీట్లతో ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఆ ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబునాయుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. వైఎస్సార్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు.
2014లో ఏపీ విభజన సమయంలో ఆయన కేంద్ర మంత్రి. విభజనానంతరం ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. మళ్లీ సినిమాల్లో ఆయన బిజీ అయ్యారు. ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతల సన్మాన సభలో చిరంజీవి ప్రసంగిస్తూ తన సేవా కార్యక్రమాలే అత్యున్నత పురస్కారం దక్కడానికి కారణమని భావిస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవన్నారు. రాజకీయాల్లో హుందాతనం వుండాలని ఆయన కోరారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా వుండడం లేదన్నారు. అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల్ని తట్టుకోలేకే రాజకీయాల నుంచి బయటికి రావాల్సి వచ్చిందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వ్యక్తిగత విమర్శల్ని తిప్పికొడితేనే రాజకీయాల్లో మనుగడ సాగించే పరిస్థితి వుందన్నారు.