మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ దెబ్బకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలవిలలాడుతున్నారు. నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వేమిరెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలకబూనడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
నెల్లూరు సిటీ టికెట్‌ను మరోసారి అనిల్‌కు ఇస్తే, తాను ఎంపీగా పోటీ చేయనని సీఎం జగన్‌కు వేమిరెడ్డి గతంలో తేల్చి చెప్పారు. దీంతో అనిల్‌ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సమస్య పరిష్కారమైందని అంతా భావించారు. కానీ కొత్త సమస్య తలెత్తింది. నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ సూచించిన డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను ఎంపిక చేయడంపై వేమిరెడ్డి గుర్రుగా ఉన్నారు.
కనీసం అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు మర్యాదకైనా తన అభిప్రాయం తీసుకోకపోవడం ఏంటని వేమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనను నెల్లూరు నుంచి తరిమేసిన వేమిరెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలనే పట్టుదలతో అనిల్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. నెల్లూరు సిటీ నుంచి బీసీ నాయకుడినైన తనను తప్పిస్తే, ఆ సామాజిక వర్గంలో నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని, కావున మైనార్టీ అభ్యర్థిని నిలబెడితే పార్టీకి మంచిదని సీఎంకు అనిల్ సూచించినట్టు తెలిసింది.
అనిల్ ఐడియాకు సీఎం జగన్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మైనార్టీ అభ్యర్థిని కూడా నువ్వే సూచించాలని సీఎం అడగడం, వెంటనే తన వాడైన డిప్యూటీ మేయర్ పేరును అనిల్ ప్రస్తావించారు. అనిల్ సూచన మేరకు ఖలీల్‌కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారికంగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ ఖలీల్ పేరును ప్రకటించారు.
తనకు కనీస గౌరవం ఇవ్వకుండా, అనిల్ మనిషికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకున్నారు. దీంతో ఈ రాజకీయాల్లో ఇమడలేని సెల్ స్విచాఫ్ చేసి వేమిరెడ్డి ఎక్కడికో వెళ్లిపోయారు. వేమిరెడ్డి నిర్ణయంతో వైసీపీ షాక్‌లో వుంది. మరోవైపు వేమిరెడ్డిని దెబ్బ కొట్టామని అనిల్ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.