నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయమైన కేసులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది క్రితం నెల్లూరు కోర్టులో ఫైళ్లు మిస్ అయ్యాయి. ఈ ఫైళ్లు మాయం కావడం వెనుక మంత్రి కాకాణి ప్రమేయం వుందని ప్రతిపక్ష నాయకుడు సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కోర్టులో ఫైళ్లు మాయం కావడాన్ని ఏపీ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. అయితే ఫైళ్లు మాయం కావడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాణి పేర్కొన్నారు. ఈ విషయమై సీబీఐ విచారణ ఎదుర్కోడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. మరోవైపు పోలీసులు కేసు విచారించారు. చోరీ అలవాటున్న సయ్యద్ హయత్, షేక్ ఖాజారసూల్ న్యాయ స్థానంలో ఫైళ్లు ఉన్న బ్యాగ్ దొంగలించినట్టు తేల్చారు.
ఏపీ పోలీసుల విచారణ నిష్పాక్షికంగా లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏడాది పాటు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. 88 మంది సాక్షులను విచారించి 403 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.
ఇందులో కాకాణికి ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. ఏపీ పోలీసులు నిరూపించినట్టుగానే చోరీలకు పాల్పడే ఆ ఇద్దరు వ్యక్తులే ఫైళ్ల బ్యాగ్‌ను దొంగలించినట్టు నిర్ధారించారు. దీంతో కాకాణిపై ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవాలని తేలిపోయింది.