వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో దూకుడు పెంచడం, మరోవైపు టీడీపీ-జనసేన కూటమి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆ రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనపై నాన్చివేత ధోరణి ఏంటనే ఆవేదన టీడీపీ, జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకునే ప్రమాదం వుందనే చర్చ మొదలైంది.
ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడి నివాసంలో ఆయనతో పవన్‌కల్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌కల్యాణ్ చేసిన ప్రకటన ఆ రెండు పార్టీల్లో దుమారం రేపింది. పొత్తుపై నెగెటివ్ ప్రభావం పడుతుందనే ప్రచారం జరిగింది. పవన్ ప్రకటన తర్వాత ఇవాళ ఇద్దరు నాయకులు భేటీ కావడంతో సీట్లు, నియోజకవర్గాలపై స్పష్టత వస్తుందని ఆ రెండు పార్టీల నేతలు ఆశిస్తున్నారు.
ఇరుపార్టీల నేతల నుంచి ఒత్తిడి వస్తుండడంతో వ్యూహాత్మకంగా చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారనే చర్చ లేకపోలేదు. ఇప్పట్లో సీట్లు, నియోజకవర్గాలపై చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పష్టత ఇవ్వకపోవచ్చంటున్నారు. నామినేషన్ల వరకూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ డ్రామాను కొనసాగిస్తారనే చర్చ నడుస్తోంది. కేవలం జనసేన కార్యకర్తలు, నాయకుల కోసం చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నట్టు పవన్ నటిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇందుకు పవన్‌కల్యాణ్ కూడా అంగీకరించారని, అయితే ఆ వాస్తవాన్ని బయట పెట్టకుండా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. భేటీ తర్వాత ఏ విషయమై చర్చించారో చెబితే, అప్పుడు ఎంతోకొంత నమ్మకం ఏర్పడుతుందని జనసేన శ్రేణులు అంటున్నాయి. ఈ భేటీ కూడా ఏమీ తేల్చకపోతే మాత్రం తమను చంద్రబాబు, పవన్ మోసగిస్తున్నారనే నిర్ణయానికి జనసేన శ్రేణులు రావచ్చు.
కాగా వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించుకుంటూ పోతున్న వేళ టీడీపీ, జనసేన అధినేతల భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఏయే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు?, ఏవైనా ప్రకటనలు ఉంటాయా ? అనేది అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.