బెల్లంకొండ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్ కంపల్సరీ. కొంచెం కామెడీ, ఇంకొంచెం లవ్, ఇంకాస్త డ్రామా, అక్కడక్కడ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడతాడు ఈ హీరో. అందుకు తగ్గట్టే దర్శకుల్ని ఎంపిక చేసుకుంటాడు.
అయితే ఛత్రపతి రీమేక్ కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకొని తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ హీరో, తన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు కాస్త కొత్త కథల్ని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
షార్ట్ గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ మరో సినిమా మొదలుపెట్టాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈసారి సాగర్ చంద్రకు అవకాశం ఇచ్చాడు. అతడి దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమా చేస్తున్నాడు. అతడి సినిమాలు యాక్షన్ డోస్ తో పాటు కాస్త విలక్షణంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న బెల్లంకొండ, ఇప్పుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ దర్శకుడు కూడా రెగ్యులర్ డైరక్టర్ కాదు. నాంది, ఉగ్రం సినిమాలు అతడి శైలిని చెబుతాయి.
ఇలా యాక్షన్ తో పాటు కంటెంట్ ఉన్న సినిమాల వైపు మొగ్గుచూపుతున్నాడు బెల్లంకొండ. తెలుగులో ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతున్న ఈ హీరో, ఈ ఏడాదిలో థియేటర్లలోకి వస్తున్నాడు.