పవన్ నిశ్చింత..సైనిక్స్ కు టెన్షన్

సినిమా తీసిన డైరక్టర్‌కు తెలుసు చివరికి క్లయిమాక్స్ ఏమవుతుందో. కానీ చూసే ప్రేక్షకుడికి తెలియక టెన్షన్ వుంటుంది. జనసేన ఎన్నికల పోటీ వైనం అలాగే వుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో బేరాలు సాగించి ఎన్ని…

సినిమా తీసిన డైరక్టర్‌కు తెలుసు చివరికి క్లయిమాక్స్ ఏమవుతుందో. కానీ చూసే ప్రేక్షకుడికి తెలియక టెన్షన్ వుంటుంది. జనసేన ఎన్నికల పోటీ వైనం అలాగే వుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో బేరాలు సాగించి ఎన్ని సీట్లు తీసుకుంటారు. ఏయే సీట్లు తీసుకుంటారు. అసలు పొత్తు వుంటుందా? అప్పుడు భాజపా కలిసి వస్తుందా? రాదా? ఇవన్నీ ప్రశ్నలే.

ఏ సీట్లు తీసుకుంటారో తెలియక ఆశావహులకు టెన్షన్. మరోపక్క తెలుగుదేశం పార్టీ తెలివిగా తమ అను కుల మీడియాల్లో ఒక్కో స్ధానానికి ఎవరు పోటీ చేస్తారో స్లోగా ప్రకటించేస్తూ వెళ్తోంది. జగన్ మాదిరిగా అధికారికంగా ప్రకటిస్తే వికటిస్తుందని తెలుసు. అందుకే మార్గం.

జగన్ సాహసి కాబట్టి, ఎవరు ఏం అనుకుంటే అనుకోని అని ధైర్యంగా తన జాబితా ముందుగా ప్రకటించుకుంటూ వెళ్లిపోతున్నారు. ఎన్నికల చరిత్రలో నోటిఫికేషన్ రాకుండా ఇంత ముందుగా జాబితా ప్రకటించిన నాయకుడు జగన్ మాత్రమే. జనసేన అధిపతి తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. ఇక మిగిలిన పార్టీ జనాల సంగతేమిటి? ఒక పక్క తెలుగుదేశం అను కుల మీడియాలో ఒక్కో జోన్ లో తెలుగుదేశం తరపున ఎవరు పోటీ చేస్తారో గ్యాసిప్ లుగా వదిలేస్తున్నారు. ఎక్కడా సరైన స్థానం ఒక్కటి కూడా వదలడం లేదు. మరింక జనసేనకు ఇచ్చే సీట్లు ఎక్కడ అన్నది సైనిక్స్ కు తెలియడమే లేదు.

కానీ ఇలాంటి టైమ్ లో కూడా పవన్ చాలా నిశ్చింతగా వున్నారు. వారాహి యాత్ర అనే ఊసే లేదు. ఉత్తరాంధ్ర ప్రచారం వారాహి మీద అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆపేసారు. దక్షిణ కోస్తా అన్నారు కేవలం కాపులు బలంగా వుండే రెండు మూడు ప్రాంతాల్లో చేసి ఆపేసారు. ఆ తరువాత నుంచి కేవలం విజయవాడ లేదా హైదరాబాద్ లకే పరిమితం అయిపోయారు. అది కూడా కేవలం ప్రకటనల వరకే. మిగిలిన కార్యక్రమాలు అన్నీ మనోహర్ నే చూసుకుంటున్నారు.

ఇదంతా చూసి సైనిక్స్ కు టెన్షన్ వస్తోంది. తమకు అవకాశం వుంటుందా వుండదా అని ఆశ పెట్టుకున్న వాళ్లు అయోమయంగా వుండిపోయారు. కొణతాల రామకృష్ణ పార్టీలోకి వచ్చారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తారని వార్తలు వచ్చాయి. విజయవాడకు చెందిన తెలుగుదేశం నాయకుడు బుద్దా వెంకన్న తనకు అనకాపల్లి టికెట్ ఇవ్వమని అడగడం కొణతాల అనుచరులను అయోమయంలో పడేసింది.

ఒక పక్క వైకాపా జనాలు తమ పనులు తాము చేసుకోవడం, ఎన్నికలకు సిద్దం కావడం మొదలైంది. తెలుగుదేశం జనాలు కూడా మెల్లగా తమ పనులు తాము మొదలు పెట్టారు. ఎటొచ్చీ ఏమీ తెలియక, ఇటు సోషల్ మీడియాలో హడావుడి తగ్గించేసింది ఎవరు అంటే కేవలం జన సైనిక్స్ మాత్రమే.