అవకాశాల్ని అందిపుచ్చుకుని ముందుకు పోయినప్పుడే విజయం వరిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో సానుకూలతను వెంటనే సొమ్ము చేసుకోవాలి. లేదంటే ప్రత్యర్థులు హైజాక్ చేసే ప్రమాదం ఎప్పుడూ పొంచి వుంటుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. నిజానికి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని ప్రచారం ఎక్కువే. అయితే దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల ముంగిట టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఎంపికలోనే చేతులెత్తేశాయి.
ఎంత సేపూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టడానికే టీడీపీ, జనసేన, ఆ పార్టీలను మోసే ఎల్లో మీడియాకు సరిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసి, జగన్‌ను ఓడించాల్సి వుంటుందనే కనీస స్పృహ కూడా టీడీపీ, జనసేన నేతల్లో లేకపోయింది. ఆలస్యం అమృతం విషం అనే సామెత చందాన… టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఆలస్యం అయ్యే కొద్ది నష్టం జరుగుతోంది. ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఆవిరై, నిరుత్సాహం పెరుగుతోంది.
ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే వుందని అధినాయకులే చెబుతూ, అభ్యర్థుల ప్రకటన చేయకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ… ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ వైఎస్ జగన్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. తన పార్టీ శ్రేణుల్ని సమరానికి సమాయత్తం చేయడంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి దీటైన కౌంటర్ కొరవడింది.
సవాల్‌కు ప్రతి సవాల్ విసిరే పరిస్థితి టీడీపీ-జనసేన కూటమి నుంచి లేదు. ఆ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయే తప్ప, సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు ఊసే లేదు. చంద్రబాబు, పవన్ మధ్య సయోధ్య లేదనేందుకు ఇటీవల ఎవరికి వారు అభ్యర్థులు, సీట్లు ప్రకటించుకోవడమే నిదర్శనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటికి రానంత వరకే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల హడావుడి కనిపించింది.
సిద్ధం అంటూ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి, జనంలోకి వెళ్లడం మొదలు పెట్టిన తర్వాత, ఆ ఇద్దరు నాయకుల నుంచి సౌండ్ లేదు. కనీసం చంద్రబాబు అప్పుడప్పుడైనా రా…కదిలిరా అంటూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బాబు మిత్రుడు పవన్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో జనసేన నేతలకే తెలియని పరిస్థితి. ఇలాగైతే జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యమా? అనే ప్రశ్న జనసేన, టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది.