టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఈజీ కాదు. ఎందుకంటే ఆ పార్టీలో చాలా కోటాలు వుంటాయి. లోకేశ్ కోటాతో పాటు ఎల్లో మీడియాధిపతుల కోటాను కూడా భర్తీ చేయాల్సి వుంటుంది. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేతల్లో ఏమీ లేదని ఇటీవల కాలంలో టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందుకే టీడీపీ రోజురోజుకూ పతనమవుతోందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.
ప్రజలతో , గెలుపోటములతో సంబంధం లేకుండా కొందరు అభ్యర్థుల్ని ఎల్లో మీడియా ప్రమోట్ చేస్తోంది. అలాంటి వారిలో కొలికపూడి శ్రీనివాసరావు ఒకరు. ఈయనకు ఎల్లో మీడియాతో తప్ప, మరెవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవని టీడీపీ నేతలు చెబుతుంటారు. హైదరాబాద్‌లో కూచుని నిత్యం ఏపీ రాజకీయాలపై మాట్లాడుతుంటారు. వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పార పడుతుంటారు. ఇంతకంటే ఎల్లో మీడియాకు కావాల్సిందేముంది? అందుకే ఈయన గారు ఆ మీడియాకు ప్రియమైన నాయకుడయ్యారు.
ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీలో అధికారికంగా చేరారే తప్ప, ఆయన చాలా కాలంగా ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. ఎల్లో చానళ్లలో కూచుని జగన్‌ను తిడుతూ పైసా ఖర్చు లేకుండా ఉచిత ప్రచారం పొందుతున్నారు. ఇదే అదునుగా ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.
నిన్నగాక మొన్న టీడీపీలో చేరిన కొలికపూడికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈయనకు ఎల్లో మీడియాధిపతి మద్దతు. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ దేవదత్ కంటే కొలికపూడికి ప్రజాదరణ ఉన్నట్టు టీడీపీ సర్వేల్లో కూడా వచ్చిందట! అంతే మరి, మనకు నచ్చిందే రంభ అన్నట్టు, ఎల్లో మీడియాకు నచ్చినోడే అభ్యర్థి, లేదంటే పనికి రాడు. చంద్రబాబు, లోకేశ్‌లపై కంటే కొలికపూడి ఆ మీడియా అధిపతినే ఎక్కువ నమ్ముకున్నారు. ఏమవుతుందో చూడాలి.