కమలం డెసిషన్ పవన్ కు షాకిస్తుందా?

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి.. అధికారం చంద్రబాబుకు దక్కేలా చేయాలంటే.. తానొక్కడూ సరిపోను అని జనసేనాని పవన్ కల్యాణ్ కు ఫుల్ క్లారిటీ ఉంది. Advertisement తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులు ప్రకటించుకుని…

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి.. అధికారం చంద్రబాబుకు దక్కేలా చేయాలంటే.. తానొక్కడూ సరిపోను అని జనసేనాని పవన్ కల్యాణ్ కు ఫుల్ క్లారిటీ ఉంది.

తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులు ప్రకటించుకుని ముందుకు వెళుతున్నాయి. సీట్ల పంపకాలు తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నాయి. అయినా సరే, తమ రెండు పార్టీలు కలిసినా సరే.. జగన్ ను ఓడించడం అసాధ్యం అనే భావనతో ఉన్న ఆయన, ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అనే సాకు చెబుతూ.. మోడీ బలాన్ని కూడా చంద్రబాబుకు అనుకూలంగా వాడడానికి, కమలం పార్టీని కూడా జట్టులో కలుపుకోవడానికి తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర మాజీ సారథి, ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాటలు పవన్ కల్యాణ్ కు షాక్ ఇస్తుండవచ్చు.

సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయబోతున్నట్లు వెల్లడించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆయన అధిష్ఠానం సంకేతాలతోనే.. ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. అదే నిజమైతే.. పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు అశనిపాతమే.

సోము వీర్రాజును పార్టీ సారధిగా తప్పించడం దగ్గరినుంచి, పురందేశ్వరికి పగ్గాలు అప్పగించడం వరకు ఆ పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు కోవర్టులు చక్రం తిప్పారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే పురందేశ్వరి పగ్గాలు స్వీకరించినప్పటినుంచి ఇండైరక్టుగా చంద్రబాబునాయుడుకు అనుకూల ప్రకటనలే చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, తామందరం అభిప్రాయాలు హైకమాండ్ కు చెప్పేశామని ఆమె అంటున్నారు. వారు ఎలాంటి అభిప్రాయాలు చెప్పి ఉంటారో అందరూ ఊహించవచ్చు.

అయితే తాజాగా సోము వీర్రాజు .. మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం తెలుగుదేశానికి పెద్ద దెబ్బ. రామాలయం ప్రారంభం తర్వాత.. మోడీ ఇమేజి అమాంతం మరికొంత పెరిగిన నేపథ్యంలో ఏపీలో భాజపా అనుకూల ఓటు శాతం కూడా పెరిగి ఉంటుందని, అదంతా ఆ పార్టీకి పడితే.. తెలుగుదేశానికి నష్టమేనని పలువురు అంచనా వేస్తున్నారు.