వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రాజకీయ విరామాన్ని ఆశ్రయించబోతున్నారా? జిల్లా రాజకీయ పరిణామాలలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే కినుకతో.. ఆయన పార్టీకి పూర్తిగా దూరం కాకపోయినప్పటికీ, అలక వహించి నిశ్శబ్దం పాటించబోతున్నారా? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యంతో పాటు, జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన నాటినుంచి ఆయనకు దగ్గరగా మెలగుతున్నారు. అలాంటి నేత అలకపూనడం నిజమే అయితే అది పార్టీ అంతర్గత రాజకీయాల్లో సంచలన అంశమే కాబోతోంది.
మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే నెల్లూరుకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఉన్నపళంగా నెల్లూరు నుంచి పయనమై అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలని ఆయన జిల్లాలోని తన అనుచరులకు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఆల్రెడీ ప్రకటించింది. ఈ సమయంలో అలకపూనడం అంటే ఆశ్చర్యమే.
తనను ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత.. ఆ పరిధిలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చడం గురించి ఆయన పట్టుపట్టారని, అయితే పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు కు తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి ఎమ్మెల్యే టికెట్ అడిగారని, వీలు కుదరకపోతే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ కు అడిగారని అంటున్నారు. అయితే సిటింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా ప్రకటించిన జగన్, ఆయన అనుచరుడు ఖలీల్ ను ఇన్చార్జిగా నియమించడంతో వేమిరెడ్డి అలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది.
వేమిరెడ్డి అలక, అజ్ఞాతం నిజమే అయితే గనుక.. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలను ఒకసారి పునర్సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీకి దగ్గరి వారైన బాలినేని శ్రీనివాసరెడ్డి అలక పర్వం ఇంకా ముగియలేదు. అంతే కీలకంగా పార్టీకి దన్నుగా ఉండే వేమిరెడ్డి కూడా అలగడం మంచి పరిణామం కాదు.
ఠికానా లేని నాయకులు అలిగినా, పార్టీ వీడి వెళ్లిపోయినా, వెళ్లిపోతూ జగన్ మీద నిందలు వేసినా ప్రజలు కూడా పట్టించుకోరు. కానీ.. కొందరు ముఖ్యమైన నాయకులు వెళ్లిపోయేప్పుడు.. వారు నోరు మెదపకపోయినా కూడా ప్రజలు పట్టించుకుంటారు.