పొంగులేటి, తుమ్మలకు చెక్ పెట్టిన భట్టి!

ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దాదాపుగా స్వీప్ చేసిన జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటి. అలాంటి నేపథ్యంలో అక్కడినుంచి ఎంపీగా కూడా…

ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దాదాపుగా స్వీప్ చేసిన జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటి. అలాంటి నేపథ్యంలో అక్కడినుంచి ఎంపీగా కూడా పార్టీ గెలుస్తుందనే అంచనాలు పుష్కలంగా ఉన్నాయి. గెలుపు గ్యారంటీ అనిపిస్తున్న‌ సీటు కోసం సహజంగా పోటీకూడా ఎక్కువే ఉంటుంది. అయితే కాంగ్రెసు పార్టీలోనే ఆ సీటును కోరుకుంటున్న ఇద్దరు కీలక నాయకులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెక్ పెట్టారు. ఆయన భార్య మల్లు నందిని, ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం ఎంపీ స్థానంపై పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు ఆశలున్నాయి. భట్టి విక్రమార్కతో సహా ఈ ముగ్గురూ కూడా మంత్రులే. పొంగులేటి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీగా కూడా గెలిచారు. ఈ ముగ్గురు నాయకులకు కూడా జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. వీరు కేవలం తమ తమ ఎమ్మెల్యే నియోజకవర్గాలకు పరిమితమైన నాయకులు కాదు.

పొంగులేటి తెరాసను వీడిన తర్వాత.. తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే ఖమ్మం జిల్లా మొత్తం పార్టీని గెలిపిస్తాననే ఆఫర్ తోనే ఇతర పార్టీల్లోకి ఎంట్రీ ప్రయత్నాలు చేశారు. టికెట్ల సంగతి పక్కన పెడితే.. మాట ప్రకారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ విజయంలో కీలకభూమిక పోషించారు. ఆయన ప్రతి వ్యవహారాల్లోనూ ఎంతో కీలకంగా ఉండే తన సోదురుడు ప్రసాద్ రెడ్డిని ఖమ్మం ఎంపీగా పోటీచేయించాలని అనుకుంటున్నారు.

తుమ్మల కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ఇవి దాదాపుగా తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. తన కొడుకు యోగేందర్ తో రాజకీయ అరంగేట్రం చేయించాలని ఆయన తపన పడుతున్నారు. ఖమ్మం ఎంపీగా కొడుకును బరిలోకి దించే ఆలోచనతో ఉన్నారు. ఇలా రెండు ప్రధాన సామాజిక వర్గాల నుంచి ఇధ్దరు బలమైన నాయకులు.. ఇద్దరూ కూడా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు.. ఖమ్మం ఎంపీ సీటును ఆశిస్తుండగా.. మధ్యలో మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని టికెట్ కోసం దరఖాస్తు చేయడం విశేషం.

ఆ ఇద్దరికీ లేని అదనపు బలం భట్టికి ఉంది. ఆ ఇద్దరూ కూడా కేవలం ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వేరే పార్టీల్లోంచి కాంగ్రెసులోకి వచ్చారు. భట్టి తొలినుంచి కాంగ్రెసు పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకుడు. పార్టీ గెలుపుకోసం ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నాయకుడు. సీఎం పదవిని ఆశించిన కీలక నాయకుడు. సీఎం పదవి విషయంలో అధిష్ఠానం సూచన మేరకు వెనక్కు తగ్గిన నేపథ్యంలో.. ఖమ్మం ఎంపీ సీటును తన భార్యకు ఆశిస్తున్నారు. అధిష్ఠానం తన కోరికను మన్నిస్తుందనే నమ్మకం ఆయనకు ఎక్కువగా ఉంది.