సౌత్ సీటు కోసం ముస్లింల పట్టు!

విశాఖ సౌత్ అసెంబ్లీ సీటు తమకు ఇవ్వాల్సిందే అని ముస్లిం సంఘాలు పట్టుబడుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పాతిక వేల దాకా ఓట్లు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం…

విశాఖ సౌత్ అసెంబ్లీ సీటు తమకు ఇవ్వాల్సిందే అని ముస్లిం సంఘాలు పట్టుబడుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పాతిక వేల దాకా ఓట్లు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం డాక్టర్ ఎస్ ఏ రహమాన్ ని తాము గెలిపించుకున్నామని వారు చెబుతున్నారు.

నాటి నుంది నేటి వరకూ ముస్లిం అభ్యర్ధి మళ్ళీ ఎమ్మెల్యే కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉత్తరాంధ్రాలో ముస్లిం సామాజిక వర్గానికి ఒక్క సీటు అయినా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలకు టికెట్ ఇచ్చిన పార్టీకే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తాము మద్దతు ఇస్తామని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్లు ఉంటే ఏ ఒక్క దానినీ ముస్లింలకు కేటాయించక పోవడం ఏమిటని నిలదీస్తున్నాయి. ఒక్క విశాఖ జిల్లాలోనే ముస్లింల జనాభా మూడున్నర లక్షల దాకా ఉందని వారు లెక్కలు చెబుతున్నారు.

రాష్ట్రంలో చూసుకుంటే విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా అయిదు సీట్లు ముస్లింలకు ఇవ్వాల్సిందే అంటున్నారు. తమకు ఇచ్చిన సీట్లను తప్పకుండా గెలిపించుకుంటామని కూడా ముస్లిం సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు

ఒక వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం తామే ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతామని తమ సత్తా చాటుతామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే సీటు ఇవ్వకపోతే ఆ వర్గం శాంతించేట్టు లేదని అంటున్నారు.

విశాఖలో ముస్లింలకు సీటు ఎందుకు ఇవ్వరన్న దాంతో మైనారిటీ వర్గాలు గుర్రు మీద ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ మీదనే వారు దృష్టి పెట్టారు. వైసీపీ టీడీపీ ఇంకా విశాఖ సౌత్ విషయం తేల్చలేదు. టీడీపీ అభ్యర్ధితో పాటు జనసేన అభ్యర్ధి కూడా సౌత్ లో పోటీ పడుతున్నారు. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయనకు కాకుండా ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచనలో వైసీపీ సతమతమవుతోంది అంటున్నారు. ఈ మధ్యలో ముస్లింలు పట్టుబట్టడంతో ప్రధాన పార్టీల అభిప్రాయాలు మారుతాయా అన్నది చూడాలి.