ఉత్తరాంధ్ర ఓటరు విషయంలో ఎవరైనా తక్కువగా ఆలోచించినా లేక ఎక్కువగా ఆలోచించినా ఇబ్బందే అంటున్నారు. ఉత్తరాంధ్ర ఓటరు ఏ సంగతీ తేల్చేసే సమర్ధుడు అంటున్నారు. వారు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా 2024 ఎన్నికల్లో మారిపోయారు. ఇక్కడ ఉన్న ముప్పయి నాలుగు సీట్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయన్నది ఈ రోజుకీ అంచనాలకు అందడం లేదు.
అయితే ఉత్తరాంధ్ర ఓటరు ఓటు ఎత్తాడంటే ఏదో ఒక పార్టీకి ఏకపక్షంగా గుద్దేస్తారు అని అంటున్నారు. దీనికి సంబంధించి గత నాలుగు ఎన్నికల లెక్కలు ముందుంచుకుని మరీ గుర్తు చేస్తున్నారు. తాము గెలిపించాలనుకునే పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు వంతుల సీట్లు కట్టబెట్టడం ఉత్తరాంధ్ర ఓటరు విలక్షణత అని అంటున్నారు.
ఉమ్మడి ఏపీలో 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉత్తరాంద్ర మూడు జిల్లాలలో 37 అసెంబ్లీ సీట్లు ఉండేవి. ఇందులో 21 సీట్ల దాకా కాంగ్రెస్ గెలిచింది. అంటే మెజారిటీ సీట్లు ఆ పార్టీవే అన్న మాట. హోరా హోరీ పోరు సాగలేదు. అదే 2009 ఎన్నికలు వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన తరువాత మూడు సీట్లు తగ్గి 34కి తగ్గింది.
ఈ ముప్పయి నాలుగులో కాంగ్రెస్ కి 23 సీట్లు కట్టబెట్టారు ఉత్తరాంధ్ర వాసులు. 11 సీట్లతో టీడీపీ సర్దుకోవాల్సి వచ్చ్చింది. విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీకి 24 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఒకటి ఇచ్చారు. వైసీపీకి తొమ్మిది సీట్లు మాత్రమే దక్కాయి. అంటే టీడీపీకి ఈసారి పట్టం కట్టారు.
అదే విధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 28 సీట్లు కట్టబెట్టారు. ఇది ఉత్తరాంధ్ర పొలిటికల్ హిస్టరీలోనే సరికొత్త రికార్డు. నూటికి ఎనభై శాతం సీట్లు వైసీపీకి అప్పగించిన ఎన్నిక ఇది. కేవలం ఆరు సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి.
ఇపుడు జరగనున్న ఎన్నికల కోసం వైసీపీ టీడీపీ ఉత్తరాంధ్రా మీద పూర్తి దృష్టి పెట్టేశాయి. ఎక్కువ సీట్లు ఎవరు గెలుచుకుంటారు అన్న ఆసక్తి ఉంది. వైసీపీ తమకు గతంలో వచ్చిన 28 సీట్లు తగ్గవని అంటోంది. టీడీపీ మొత్తం సీట్లు తమవే అంటోంది. జనాలు మాత్రం మెజారిటీ సీట్లు ఏదో ఒక పార్టీకే ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఆ పార్టీ ఏది అన్నదే సస్పెన్స్.