జన‌సేన కు కేటాయించే సీట్ల‌న్నింటిలోనూ లొల్లే!

తెలుగుదేశం- జ‌న‌సేన ల పొత్తు వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. తెలుగుదేశం అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు జైల్లో ఉండ‌గా, జైలు బ‌య‌ట పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు జ‌న‌సేన…

తెలుగుదేశం- జ‌న‌సేన ల పొత్తు వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. తెలుగుదేశం అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు జైల్లో ఉండ‌గా, జైలు బ‌య‌ట పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్! అయితే తెలుగుదేశం పార్టీ ఆ కృత‌జ్ఞ‌త‌ను కూడా ఏం పెట్టుకోలేదు!

ప‌వ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కూట‌మి సీఎం అభ్య‌ర్థి కాద‌ని చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ తేల్చి చెప్పారు! ఆ త‌ర్వాత పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన ఆశిస్తున్న స్థానాల్లో కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి సంశ‌యించ‌లేదు!

అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌రో మార్గం లేక‌, జ‌గ‌న్ మీద అక్క‌సుతో ర‌గిలిపోతూ చంద్ర‌బాబు అడుగుల‌కు మ‌డుగులు ఒత్త‌డ‌మే త‌ప్ప మ‌రో ప‌ని లేకుండా పోయింది! ఆ సంగ‌త‌లా ఉంటే.. టీడీపీ సీట్ల‌కు సంబంధించి ప‌చ్చ‌మీడియా లీకులూ లాంఛ‌నంగా మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ తో పొత్తు నేప‌థ్యంలో అధికారికంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకోలేక లీకుల ద్వారా కార్యం చ‌క్క‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది టీడీపీ. చంద్ర‌బాబుకు ఇది బాగా అల‌వాటైన ప‌నే! బాబుతో పొత్తు అంటే ఇలానే ఉంటుంద‌ని కూడా చ‌రిత్ర చెబుతోంది.

మ‌రి ఈ లీకుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించ‌బోయే సీట్లు.. అనే ప్ర‌చారం పొందుతున్న సీట్ల‌లో తెలుగుదేశం పార్టీ వాళ్లు ర‌గిలిపోతున్న వార్త‌లూ వ‌స్తున్నాయి! ఏ సీట్ల‌ను అయితే తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు కేటాయిస్తుంద‌నే లీకుల‌ను ప‌చ్చ‌మీడియా ఇస్తోందో.. స‌రిగ్గా అక్క‌డ టీడీపీ ఇన్ చార్జిలు ఇండిపెండెంట్ లేదా రెబ‌ల్స్ గా నిల‌బ‌డ‌టానికి సై అంటున్నారే క‌థ‌నాలూ వ‌స్తున్నాయి! అక్క‌డ ఇప్ప‌టికే వారు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కూడా మొద‌లుపెట్టారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ విష‌యంలో ఇదే జ‌రుగుతూ ఉంది! ఈ మూడు సీట్ల‌నూ జ‌న‌సేకు టీడీపీ కేటాయించ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఇక్క‌డ తెలుగుదేశం ఇన్ చార్జిలు ఎవ‌రికి వారు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు! రాజీప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని.. ఇక్క‌డ తామైతే గెలుస్తాం త‌ప్ప జ‌న‌సేన అయితే గెల‌వ‌ద‌ని వారు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు! అందులోనూ ఇక్క‌డ టీడీపీ ఇన్ చార్జిలు మాజీ ఎమ్మెల్యేల హోదాల‌ను క‌లిగిన వారు కావ‌డంతో.. వీరి ర‌చ్చ‌కు మ‌రింత ప్రాధాన్యం ద‌క్కుతోంది!

కేవ‌లం ఉమ్మ‌డి కృష్ణాలోనే కాదు.. ఏపీలో జ‌న‌సేన‌కు టీడీపీ కేటాయించే అన్ని సీట్ల విష‌యంలోనూ ఈ ర‌చ్చ‌లు త‌ప్ప‌వ‌నే విష‌యం ఇక్క‌డి నుంచినే సూఛాయ‌గా తెలుస్తోంది. లీకుల‌తోనే ఈ ర‌చ్చ‌లైతే.. అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రావ‌డంతో అగ్గిరాజుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి!