మాయలోడు సినిమాలో చినుకు చినుకు సాంగ్.. సూపర్ హిట్! ఆ పాటకు బాబూమోహన్- సౌందర్యల జంట వేసిన స్టెప్పులు సంచలనం రేపాయి! దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అదే పాటను అలీ – సౌందర్యలతో శుభలగ్నం లో వాడుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. అలీ స్టెప్పులు కూడా ఆ పాటతో పాటు ఇంకోసారి హైలెట్ అయ్యాయి.
అయితే ముందుగా మాయలోడులో ఆ పాటను బాబూమోహన్- సౌందర్యల జంటగా చిత్రీకరించడంపై రకరకాల రూమర్లున్నాయి! ఆ సినిమాలో హీరోని కాదని అందులో కమేడియన్ తో హీరోయిన్ తో పాటను చిత్రీకరించడం పై రకరకాల పుకార్లు వినిపించాయి. దీనిపై దర్శకుడు ఎస్వీకే ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు కానీ, ఇన్నేళ్లకు ఆయన బయటపడ్డారు!
మాయలోడు హీరో రాజేంద్రప్రసాద్ సహాయనిరాకరణ వల్లే ఆ పాటను తను బాబూ మోహన్ తో చిత్రీకరించినట్టుగా ఎస్వీకే కుండబద్ధలు కొట్టారు. సినిమా చిత్రీకరణ పూర్తవుతున్న దశలో రాజేంద్ర ప్రసాద్ తమకు పూర్తి సహాయ నిరాకరణ చేశారని, అసలు సినిమా ఎలా పూర్తవుతుందో చూస్తా అనేంత స్థాయికి ఆయన వెళ్లారని ఎస్వీకే ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అన్నారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ తనపై కూడా రాజేంద్రప్రసాద్ వెటకారం ఆడారని దీంతో తను తీవ్రంగా హర్ట్ అయినట్టుగా ఎస్వీకే అన్నారు.
తమకు మిగిలిన డేట్స్ తక్కువ కావడంతో.. పాట చిత్రీకరణకు రాజేంద్రప్రసాద్ ను బతిమాలుకున్నట్టుగా ఎస్వీకే అన్నారు. అయితే ఆయన సహకరించలేదని, ఇండస్ట్రీ పెద్దలను రంగంలోకి దించినా ప్రయోజనం దక్కలేదన్నారు. చివరకు రాజేంద్ర ప్రసాద్ తో మిగిలిన డేట్స్ తో ముందుగా డబ్బింగ్ పూర్తి చేయించినట్టుగా, ఆ డబ్బింగ్ చెప్పడానికి కూడా ఆయన షరతు పెట్టారని, మాయలోడు తమిళ డబ్బింగ్ రైట్స్ ను రాయించుకుని ఒక్క రోజు డబ్బింగ్ చెప్పడానికి ముందుకొచ్చారన్నారు!
రైట్స్ రాయించిన పత్రాలను రాజేంద్రప్రసాద్ మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ థియేటర్లోకి ఆయన ఎంటరయ్యారని, ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారని, అయితే ఆయన సీన్లను వరసగా ప్రదర్శించేసి మధ్యాహ్నానికి డబ్బింగ్ పూర్తి చేసి ఆయనకు నమస్కారం పెట్టేసినట్టుగా ఎస్వీకే అన్నారు. పాట మిగిలి ఉందనే దర్పంతో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఆయనను ఇక బతిమాలాల్సిన అవసరం లేదని, అప్పటికే బాబూమోహన్ తన మనసులో ఉండటంతో ఆయనతో పాటను చిత్రీకరించినట్టుగా ఎస్వీకే అన్నారు.
తను బాబూమోహన్ తో పాటను తీస్తున్నాననే విషయాన్ని తెలిసి.. మధ్యవర్తులు రంగంలోకి దిగారని, అయితే ఇక తనకు అవసరం లేదని, తను బాబూమోహన్ కు మాట ఇచ్చేసినట్టుగా ఇక మార్చలేనని తను నిష్కర్షగా చెప్పి, కావాలాంటే రాజేంద్రప్రసాద్ రావొచ్చని, షూటింగ్ చూసి వెళ్లొచ్చని తను చెప్పినట్టుగా ఎస్వీకే వివరించారు!
ఆ తర్వాత మాయలోడు సినిమా విడుదల కావడం, హిట్ కావడం, ప్రత్యేకించి బాబూమోహన్- సౌందర్యల పాట ఒక ఊపు ఊపడం జరిగింది! అప్పటి నుంచి తన సినిమాల్లో కమేడియన్లకు పాట పెట్టడం ఎస్వీకేకు కూడా అలవాటుగా మారింది. శుభలగ్నంలో అలీకి, మావిచిగురులో అల్లు రామలింగయ్యకు పాటలు పెట్టారు.
తను దర్శకుడు కావడానికి రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో ఎస్వీకే అన్నారు. ఎస్వీకే మొదటి సినిమా కొబ్బరిబొండాం హీరో రాజేంద్రప్రసాదే, ఆ సినిమాకు దర్శకుడిగా మరొకరి పేరు పడినా, కీలక విభాగాల్లో ఎస్వీకే పేరే పడుతుంది. దర్శకుడిగా అధికారికంగా తొలి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు హీరో రాజేంద్రప్రసాదే, అలా తన మొదటి అవకాశాల విషయంలో రాజేంద్రప్రసాద్ సహకారం ఉన్నా, మాయలోడు విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా హర్ట్ చేశారనే విషయాన్ని ఎస్వీకే చెప్పారు!
ఆ తర్వాత వీరి కాంబినేషన్ కు చాలా కాలం బ్రేక్ పడింది, అప్పుడెప్పుడో ఎస్వీకే తీసిన సరద సరదాగా అనే సినిమాలో మళ్లీ రాజేంద్రప్రసాద్ కనిపించారు. ఈ మధ్యనే ఆయన తీసిన ఒక సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక ప్రధాన పాత్రను చేశారు. అయితే పాత విషయాన్ని ఇప్పుడు ఎస్వీకేనే ప్రస్తావించారు.