కాలువ శ్రీనివాసులు.. దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాలిట అతి పెద్ద బీసీ నేత! ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఈ ఈనాడు విలేకరిని రామోజీరావు రాజకీయ నేతను చేశారంటారు! తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు గత 30 యేళ్లలో అనంతపురం జిల్లాలో తయారు చేసిన అతి పెద్ద బీసీ నేతలు మాత్రం ఇద్దరే! అందులో ఒకరు కాలువ, రెండు పార్థసారధి.
బోయ సామాజికవర్గానికి చెందిన కాలువ, కురుబ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి వీళ్లే.. చంద్రబాబు పాతికేళ్ల పై కాలంలో సృష్టించిన నేతలు! అన్నింటికీ వీరిద్దరి పేర్లే చెప్పాలి. వీరిద్దరినీ పక్కన పెడితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజ్యమంతా కమ్మ వాళ్లదే! ఇద్దరిని చూపించి తమది బీసీల పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు మూడు దశాబ్దాల నుంచి చెబుతున్నారు!
కొన్నాళ్ల కిందట కాలువ శ్రీనివాసులను అనంతపురం ఇన్ చార్జిగా, పార్థసారధిని హిందూపురం ఇన్ చార్జిగా ప్రకటించారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో తాము పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వీరిద్దరికీ ఎంపీలుగా టికెట్లను ఖరారు చేస్తారనే ప్రచారాన్ని పచ్చమీడియా లీకులుగా ఇస్తోంది.
ఆ లీకుల్లో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు పేరును పచ్చమీడియా ప్రకటించింది. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఎక్కడా అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అయితే పచ్చమీడియానే లీకులు ఇస్తోంది. మరి ఈ లీకు పచ్చమీడియా నుంచి రావడంతో కాలువ అలర్ట్ అయినట్టుగా ఉన్నారు!
తను ఎంపీగా పోటీ చేయనంటున్నారట ఆయన! తనకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ ఆయన వాదన మొదలుపెట్టారు. తనకు ఎంపీ టికెట్ వద్దని, ఎమ్మెల్యే టికెట్ కావాలనేది కాలువ డిమాండ్ అని తెలుస్తోంది!
టీడీపీ అధికారిక ప్రకటన చేయకపోయినా.. పచ్చమీడియా లీకే కాలువను హడలు కొట్టినట్టుగా ఉంది. అందుకే ఆయన ఎంపీ వద్దని, ఎమ్మెల్యే టికెట్ చాలనే వాదనతో ఉన్నట్టున్నారు! మరి పచ్చమీడియా లీకులకు టీడీపీ నేతల్లో ఉన్న భయాందోళనలు ఏ స్థాయిలో కాలువ ఉదంతం చాటుతోంది. మరి కాలువ ససేమేరా అంటే టీడీపీకి అనంతపురం ఎంపీ సీటుకు ఇప్పటికిప్పుడు ఎవర్ని తెస్తుందో!