జీడీనెల్లూరు, స‌త్య‌వేడులో మార్పు.. నిట్టూర్పు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మార్పుచేర్పుల‌పై పెద‌వి విరుస్తున్నారు. జీడీనెల్లూరు, స‌త్య‌వేడు నియోజ‌క వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌వ‌నే టాక్ వినిపిస్తోంది. స‌త్య‌వేడులో క‌నీసం సిటింగ్ ఎమ్మెల్యే…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మార్పుచేర్పుల‌పై పెద‌వి విరుస్తున్నారు. జీడీనెల్లూరు, స‌త్య‌వేడు నియోజ‌క వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌వ‌నే టాక్ వినిపిస్తోంది. స‌త్య‌వేడులో క‌నీసం సిటింగ్ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కొన‌సాగించినా బాగుండేద‌ని అక్క‌డి వైసీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కొత్త‌గా నూక‌తోటి రాజేష్‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించ‌డంతో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

జీడీనెల్లూరు సిటింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామికి నోటి దురుసు. సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్నే తిట్టేంత నోటి దురుసు ఆయ‌న‌ది. స‌ర్వేల్లో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో చిత్తూరు ఎంపీ అభ్య‌ర్థిగా పంపారు. చిత్తూరు సిటింగ్ ఎంపీ రెడ్డెప్ప‌ను జీడీనెల్లూరు నుంచి పోటీ చేయించాల‌ని అనుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. దీంతో జీడీనెల్లూరు స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని అంతా అనుకున్నారు.

రెండు రోజులు గ‌డిచే స‌రికి అంతా రివ‌ర్స్‌. జీడీనెల్లూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మ‌ళ్లీ నారాయ‌ణ‌స్వామినే నియ‌మిస్తూ ఆరో జాబితాలో ప్ర‌క‌టించారు. చిత్తూరు సిటింగ్ ఎంపీ రెడ్డెప్ప‌ను అక్క‌డి నుంచే మ‌ళ్లీ పోటీ చేయిస్తున్నారు. జీడీనెల్లూరులో నారాయ‌ణ‌స్వామిని ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల ఆయ‌న్ను వ్య‌తిరేకించే వారిలో పెరుగుతోంది. నారాయ‌ణ‌స్వామి తిరిగి జీడీనెల్లూరు టికెట్ సాధించుకోవ‌డం ద్వారా పార్టీలోని వ్య‌తిరేకుల‌పై పైచేయి సాధించిన‌ట్టైంది. దీంతో నారాయ‌ణ‌స్వామి రెచ్చిపోయే అవ‌కాశం వుంది.

ఇక స‌త్య‌వేడు విష‌యానికి వ‌స్తే… అధికార పార్టీ పెద్ద‌లు కావాల్సినంత గంద‌ర‌గోళం సృష్టించారు. ఆదిమూలంపై మ‌రీ అంత వ్య‌తిరేక‌త లేదు. తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తికి చెక్ పెట్టేందుకు స‌త్య‌వేడుకు పంపి, అక్క‌డి ఎమ్మెల్యేకు స్థాన చ‌ల‌నం క‌ల్పించారు. తిరుప‌తి ఎంపీగా పోటీ చేయ‌డానికి ఆదిమూలం నిరాక‌రించారు. దీంతో పార్టీని వీడేందుకు కూడా నిర్ణ‌యించుకున్నారు.

దీంతో తిరుప‌తి ఎంపీగా తిరిగి గురుమూర్తిని పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణ‌యించారు. ఇదే సంద‌ర్భంలో స‌త్య‌వేడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా రాజేష్‌ను ఎంపిక చేశారు. ఈ నియామ‌కంపై స‌త్య‌వేడు వైసీపీలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఇంత వ‌ర‌కూ స‌త్య‌వేడు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాజేష్‌ను క‌నీసం మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా క‌ల‌వ‌లేదు. రోజుకొక‌రిని మారుస్తూ వుంటే తామెందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

అంతేకాదు, రాజేష్‌కు స‌త్యవేడుతో ఎలాంటి సంబంధం లేద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జీడీనెల్లూరు, స‌త్య‌వేడులో చేప‌ట్టిన మార్పులపై వైసీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి. గెలిచేందుకా? ఓడేందుకా? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.