ఎంపీలుగా విముఖత.. బలానికి సంకేతమా?

రాజకీయం అంటేనే అధికారం కోసం అర్రులు చాచే వ్యవస్థ. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చెప్పేది మాత్రం ప్రజాసేవ. ప్రజలకు ఏదో ఒక మేలు చేయడానికే తాము రాజకీయం చేస్తున్నామని అంటారు. కానీ ప్రతి…

రాజకీయం అంటేనే అధికారం కోసం అర్రులు చాచే వ్యవస్థ. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చెప్పేది మాత్రం ప్రజాసేవ. ప్రజలకు ఏదో ఒక మేలు చేయడానికే తాము రాజకీయం చేస్తున్నామని అంటారు. కానీ ప్రతి ఒక్కరూ అధికారాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంటారు. అయితే అందులో కూడా ఎక్కడ ఎక్కువ అధికారం దక్కే అవకాశం ఉన్నదో.. అటువైపు వెంపర్లాడుతున్న పరిణామాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.

డిజిగ్నేషన్ల పరంగా ఎమ్మెల్యే కంటే ఎంపీ అనేది పెద్ద పదవే అయినప్పటికీ.. వారికి స్థానికంగా అధికారుల వద్ద ఉండే ప్రాబల్యం తక్కువ. ప్రజల్లో ఉండే క్రేజ్ కూడా తక్కువే. ఎక్కడో ఢిల్లీలో వారి వ్యవహారం నడుస్తుంది.. నియోజకవర్గాల్లో చాలా చోట్ల వారిని పట్టించుకునే వారుండరు. ఇలాంటి నేపథ్యంలో అధికార లాలసులైన వ్యక్తులు ఎంపీ కంటె ఎమ్మెల్యే పదవి కోసమే ఆరాటపడుతుండడం కనిపిస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను కొన్ని సమీకరణాల దృష్ట్యా ప్రమోట్ చేసి ఎంపీ స్థానాల్లో పోటీచేయాల్సిందిగా జగన్ పురమాయిస్తున్నారు. అయితే అలాంటి వారిలో చాలా మంది తాము ఎమ్మెల్యే సీట్లలోనే కొనసాగుతాం అంటూ పట్టు పడుతుండడం విశేషం.

జగన్ పురమాయింపు వల్ల గానీ, లేదా వాళ్లే అలా కోరుకోవడం వల్ల గానీ.. కొందరు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు మారారు. అలాంటి వారి నుంచి పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు వినిపించడం లేదు. అయితే ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు కేటాయిస్తే వద్దంటున్నారు. ఆలూరు నుంచి కర్నూలు ఎంపీగా వెళ్లడానికి ఇష్టపడని గుమ్మనూరు జయరాం, సత్యవేడు నుంచి తిరుపతి ఎంపీగా వెళ్లడానికి ఇష్టపడని కోనేటి ఆదిమూలం, గంగాధర నెల్లూరు నుంచి చిత్తూరు ఎంపీగా వెళ్లనని చెప్పిన నారాయణస్వామి ఇదేబాపతు.

ఈ వ్యవహారాలను గురించి.. పార్టీలో తిరుగుబాట్లు నడుస్తున్నట్టుగా ప్రచారం చేయడానికి పచ్చ మీడియా ఉత్సాహపడుతున్నది గానీ.. వాస్తవంలో.. నాయకులు ఎమ్మెల్యేలుగానే ఉండాలని ఆరాటపడడం ఆ పార్టీ బలానికి నిదర్శనం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండాలనుకోవడం వెనుక, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకమే వారిని అలా అడిగేలా చేస్తోందని అనుకుంటున్నారు.

వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, తాము ఎమ్మెల్యేలుగా గెలిస్తే మంత్రి పదవి లాంటి అవకాశం ఉంటుందని కొందరు.. స్థానికంగా తమకు కాస్త విలువ ఉంటుందని కొందరు ఆశపడుతున్నారు. అదే ఎంపీగా గెలిచినా కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చేదేం ఉండదు. తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదు గనుక సాధ్యం కాదు. అందువల్ల దానికంటె అధికారం దక్కే వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడానికే ఇష్టపడుతున్నారనే వాదన వినిపిస్తోంది. అధిక శాతం అసెంబ్లీనే కోరుకుంటూ ఉండడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.