ప్రాణహాని స్టంట్.. షర్మిలకు కూడానా?

‘‘ఒక ఎలుక తనకు ప్రాణహాని ఉన్నదని ముందే చెప్పిందనుకోండి.. దానికి ఏమైనా జరిగితే ఆ గదిలో పిల్లి మీదికే కదా అందరి అనుమానాలు వెళ్తాయి’’ అని మల్లీశ్వరి సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగు ఒకటి…

‘‘ఒక ఎలుక తనకు ప్రాణహాని ఉన్నదని ముందే చెప్పిందనుకోండి.. దానికి ఏమైనా జరిగితే ఆ గదిలో పిల్లి మీదికే కదా అందరి అనుమానాలు వెళ్తాయి’’ అని మల్లీశ్వరి సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

ధ్రువీకరణ కాని అనుమానాలు, వాటితో ముడిపెట్టి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అధికార పార్టీతో తీవ్రస్థాయిలో వైరం పెంచుకున్న- వివేకా కూతురు సునీతారెడ్డి ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందంటున్నారు. తద్వారా ఆమె, తాను చిరకాలంగా ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల మీదికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదికి అనుమానాలు వెళ్లేలా చేస్తున్నారు.

ఇందులో ట్విస్టు ఏంటంటే.. ఏపీసీసీ సారధి షర్మిలకు కూడా ప్రాణహాని ఉన్నదని ఆమె ప్రకటిస్తున్నారు. ప్రాణహాని స్టంట్ లోకి షర్మిలను లాగడం వల్ల.. కొంచెం ఎక్కువ సంచలనం రేగుతుందని ఆమె అనుకుంటున్నట్టుగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీచేయాలనుకుంటున్న సునీతారెడ్డి.. ఇలాంటి సంచలన మాటలతో పొలిటికల్ ఎడ్వాంటేజీ ఉంటుందని భావిస్తున్నారేమోనని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. హత్యకు గురైన వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల పీసీసీ సారథి అయిన తర్వాత ఇటీవల ఇడుపులపాయలో ఆమెను కలిశారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం గురించి ఇద్దరి మధ్య మంతనాలు నడిచాయి.

రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ పేజీలో ‘‘ఇందుకే పెద్దలన్నారు. శత్రుశేషం ఉండకూడదు. లేపేయ్ అన్నా ఇద్దరినీ. ఈ ఎన్నికలకు పనికి వస్తారు’’ అని పోస్టు చేశాడు. ఆ పోస్టులో తాను షర్మిల కలిసి వైస్సార్ స్మారకం వద్దకు వెళ్లిన వీడియోను పోస్టు చేశాడని సునీత పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫేస్ బుక్ పేజీలో వారిద్దరితో పాటు వైఎస్ విజయమ్మ గురించి కూడా తీవ్రమైన నిందలు వేసినట్టు తెలియజేశారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజం. ఆమె హైదరాబాదులో పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేస్తూ.. అతడి మీద చాలా ఫిర్యాదులున్నాయని, కానీ ఏపీలో వైకాపా ప్రభుత్వంతో సాన్నిహిత్యం వలన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ఈ బెదిరింపు పోస్టు రాజకీయ టర్న్ తీసుకుంది.

ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న సునీత.. రాజకీయ మైలేజీ కోసమే దీనిని వాడుకుంటున్నారా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ప్రాణహాని కేటగిరీలోకి షర్మిలను కూడా తీసుకురావడం అనేది ఆమె రాజకీయ ఎత్తుగడే అని పలువురు అంటున్నారు.