ఉత్తరాంధ్రాలో ప్రముఖ బీసీ నాయకుడిగా సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు మేనల్లుడిగా తెరచాటున ఉంటూ పనిచేసుకునే మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు వైసీపీ అధినాయకత్వం ప్రమోషన్ ఇచ్చింది. అయనను కీలకమైన 2024 ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీకి రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
బొత్స మేనల్లుడిని రాజకీయంగా ప్రమోట్ చేయాలని చాలా కాలంగా వైసీపీ చూస్తోంది. ఆ దిశగా కొన్ని చర్యలను కూడా తీసుకుంది. ఆయనకు విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా నియమించింది. ఆయనకే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఉందని కూడా ప్రచారం సాగింది.
అయితే బిగ్ షాట్ బొత్స ఉండగా ఇవేమీ కుదరవు అన్నట్లుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మజ్జి శ్రీనివాసరావుని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ప్రతిపాదన ఉన్నా ఈ రోజుకీ అది తేలలేదు. రాజకీయ లెక్కలు జిల్లాలో తేలనందువల్లనే ఆ ప్రకటన ఆలస్యం అవుతోంది అని అంటున్నారు.
ఇంతలో మజ్జి శ్రీనివాసరావుని తెచ్చి ఉత్తరాంధ్రా వైసీపీ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఉత్తరాంధ్రాలోని అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఆయనకు తోడుగా డిప్యూటీగా మజ్జి శ్రీనివాసరావుకు ప్రధాన బాధ్యతలు అప్పగించారు.
వచ్చే ఎన్నికల్లో ఈ ఎంపీ సీట్లతో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలిపించాల్సిన బాధ్యత వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసరావుల మీద ఉంటుంది. వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. మజ్జి శ్రీనుకు కూడా ఎంపీ పోటీ అన్నది లేకుండా పార్టీ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.
అలా చూసుకుంటే విజయనగరం ఎంపీ సీటు ఎవరికి ఇస్తారో చూడాలని అంటున్నారు. విశాఖ ఎంపీ బాధ్యతలను మాత్రం బొత్స సత్యనారాయణకే వదిలేశారు అని అంటున్నారు. అక్కడ ఆయన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి ఎంపీగా పోటీ చేస్తున్నారు.