రైల్వే జోన్ కంపు ఎందుకు వైసీపీ భరిస్తోంది?

రాజకీయాల్లో క్రెడిట్ నే ఎపుడూ ఎవరైనా తీసుకుంటారు. నెగిటివిటీని అవతల వారి మీద పడేస్తారు. ఏపీకి సంబంధించి చూస్తే విభజన అడ్డగోలుగా చేసి కాంగ్రెస్ ప్రధమ దోషిగా ఉంది. ఇపుడు ఆ పాపాలను కడిగేసుకోవాలని…

రాజకీయాల్లో క్రెడిట్ నే ఎపుడూ ఎవరైనా తీసుకుంటారు. నెగిటివిటీని అవతల వారి మీద పడేస్తారు. ఏపీకి సంబంధించి చూస్తే విభజన అడ్డగోలుగా చేసి కాంగ్రెస్ ప్రధమ దోషిగా ఉంది. ఇపుడు ఆ పాపాలను కడిగేసుకోవాలని చూస్తూండడం ఒక రాజకీయ తమాషా. అంతే కాదు ప్రత్యర్ధుల మీద వీలైనంతవరకూ బురద జల్లేసి తాము ఏ తప్పూ చేయలేదని కాంగ్రెస్ చెప్పుకోవాలని తాపత్రయపడుతోంది.

ఏపీ ఇన్ని రకాలుగా కునారిల్లడానికి రెండు జాతీయ పార్టీలదే తప్పు అన్నది తెలిసిన విషయం. కాంగ్రెస్ బీజేపీలు రెండూ ఆ విధంగా ఏపీ ప్రజలతో రాజకీయ చెలగాటమే ఆడారు అని అంతా అంటారు. ప్రత్యేక హొదా పోలవరం, రాజధాని వంటి వాటి విషయంలో యూపీఏకి నాయకత్వం వహించిన నిర్లక్ష్యం ఉదాశీనత మీద విమర్శలు చేయడానికి మాటలు చాలవని ఏపీ ప్రగతి కోరుకునే వారి మాట.

బీజేపీ కూడా ఏమీ తక్కువ తినలేదు కాంగ్రెస్ పాపానికి తానూ తోడు అయింది అని అంటారు. వీటికి అదనం రైల్వే జోన్ అన్నది ఇది దశాబ్దాల డిమాండ్. కాంగ్రెస్ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు సోలోగా ఏలిన నాటి నుంచి ఉన్న డిమాండ్. దాన్ని అలా ముగ్గబెట్టి పట్టించుకోకుండా కాంగ్రెస్ చేస్తే బీజేపీ ఇచ్చామని  చెబుతూ ఇవ్వకుండా చేస్తోంది.

బీజేపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం బడ్జెట్ లో ఇన్నేళ్ళలో  కేటాయించిన మొత్తాలే రెండు వందల కోట్లను మించలేదని ఆరోపణలు ఉన్నాయి. రైల్వే జోన్ విశాఖకు వచ్చేసిందని అయిదేళ్ళ క్రితం 2019 ఫిబ్రవరి 1న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చి సభ పెట్టి భారీ ప్రకటన చేశారు. నిండా అయిదేళ్ళు ముగిసినా జోన్ ఎక్కడ ఉంది అంటే ఇంకా కాగితాల మీదనే.

తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మా తప్పు ఏమీ లేదు, భూమిని ఏపీ ప్రభుత్వం ఇస్తే చిటికలో జోన్ నిర్మించేస్తామని చెప్పారు. దాన్ని పట్టుకుని టీడీపీ మాజీ మంత్రులు కీలక నేతలతో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా వైసీపీ మీద విమర్శల జడివాన కురిపించేస్తున్నాయి. అన్నీ అయ్యాక తాపీగా వైసీపీ ప్రభుత్వం రియాక్ట్ అయింది. తాను నెల క్రితమే విశాఖ రైల్వే జోన్ కి అవసరం అయిన భూమిని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రానికి చెప్పామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

అంటే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా భూమిని ఇచ్చినా కూడా తాత్సారం కేంద్రానిదే అన్న మాటను వైసీపీ నేతలు ఈ రోజుకీ చెప్పలేకపోతున్నారు అంటే రైల్వే జోన్ కంపుని తమ నెత్తిన వేసుకోవడానికి రెడీ అవుతున్నట్లేనా అని ఆ పార్టీలో వినిపిస్తోంది. 

గంటా వంటి వారు అయితే భూమి ఇవ్వలేదని చాలా హాట్ కామెంట్స్ వైసీపీ మీద చేశారు. ఈ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా తాము చేసిన పని మీద ఎప్పటికపుడు మీడియాకు చెప్పే మంత్రులు వైసీపీలో లేరా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రజలకు ప్రతీ విషయం తెలియజేయకపోతే నెగిటివిటీని మూటకట్టుకున్నట్లే అవుతోంది. దానికి వైసీపీ సిద్ధమా అన్నదే ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రశ్న.