ఒంగోలు వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వద్దు.. తిరుపతి జిల్లా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముద్దు అనేలా వైసీపీ అధిష్టానం తీరు వుంది. అందుకే ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు సంతనూతలపాడు, కావలి, కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రాంతీయ సమన్వయకర్తగా చెవిరెడ్డిని నియమించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న నాయకుల్లో చెవిరెడ్డి ఒకరు.
వైసీపీ పరిపాలన ముగింపు దశకు వచ్చే సరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చాలా ఎదిగిపోయారు. ఎంతగా అంటే… ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆ జిల్లా నేతలెవరూ పనికి రారని, చెవిరెడ్డికి మించిన నమ్మకస్తుడు లేడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మేంతగా. మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఒంగోలు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. మాగుంట స్థానాన్ని అన్ని రకాలుగా భర్తీ చేయగలిగిన ఏకైక నాయకుడు చెవిరెడ్డే అని జగన్ నమ్ముతున్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎదుగుదలతో పాటు విశ్వసనీయతపై నమ్మకం వుండడం వల్లే ఆయన స్థానికేతరుడనే సంగతిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. తద్వారా జగన్‌కు తానెంత విధేయుడో చెవిరెడ్డి నిరూపించుకున్నారు. అందుకే ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు సంతనూతలపాడు, కావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతీయ సమన్వయకర్తగా కూడా చెవిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.
ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డిలా పార్టీ కోసం పని చేసే విధేయులు, విశ్వాసపాత్రులు లేరని జగన్ భావన. తాను కోరుకున్న మాగుంటను కాదని చెవిరెడ్డిని ఒంగోలు బరిలో నిలపాలని జగన్ నిర్ణయించడం బాలినేనికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ బాలినేని, చెవిరెడ్డి వ్యవహారాలను ఒకసారి పరిశీలిస్తే… అన్ని రకాలుగా భాస్కర్‌రెడ్డే నయమని జగన్ ఉద్దేశం. బాలినేనికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని మరిచి, వివిధ సమీకరణల రీత్యా తప్పించడాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారనే కోపం వైసీపీ పెద్దల్లో వుంది.
ఇదే చెవిరెడ్డి విషయానికి వస్తే మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. అయితే చెవిరెడ్డి కోరుకున్నట్టుగా ప్రభుత్వంలో అన్ని పనులు చేసుకోగలుగతున్నారు. సీఎం ఇంట్లో వ్యక్తిలా అన్ని పనులు చక్కదిద్దుతున్నారు. అందుకే సీఎం జగన్ దంపతులకు చెవిరెడ్డి ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తి అయ్యారు. అందుకే చెవిరెడ్డి లాంటి వ్యక్తి కావాలని వారు అనుకుంటున్నారు. దగ్గరి బంధువైన బాలినేనిని ఆదరించినా పార్టీకి నష్టం చేస్తున్నాడని, కానీ అభిమాని అయిన చెవిరెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని జగన్ నమ్ముతున్నారు. అందుకే బాలినేని అంటే వద్దు, చెవిరెడ్డి ముద్దు అని జగన్ అంటున్నారు. చెవిరెడ్డి ఎంపీ కావాలనే కోరికను తీర్చడానికి సీఎం సుముఖంగా ఉన్నారు.
ఇప్పటి వరకూ చంద్రగిరిలోనే చెవిరెడ్డి రకరకాల పంపకాలు చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేయడం ఖాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ నియోజకవర్గం వ్యాప్తంగా ఇక పంపకాలే పంపకాలు. ప్రజానీకానికి సాయం చేయాలంటే మనసుండాలి. అది చెవిరెడ్డికి వుంది. మనసుంతే మిగిలివన్నీ వాటికవే వస్తాయి.
ఇంత వరకూ మాగుంట పెద్ద పారిశ్రామిక వేత్త అని, ఆయన్ను తట్టుకోవడం కష్టమని అంటుండేవారు. ఇప్పుడు చెవిరెడ్డి వచ్చాడు. గల్లా అరుణ కుటుంబమే చంద్రగిరిలో ఆయన్ను తట్టుకోలేకపోయింది. అలాంటిది ఒంగోలులో మాగుంట టీడీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం చెవిరెడ్డిని తట్టుకోవడం సాధ్యమా? మనుషులకు ప్రాంతం, కులం వుంటుందే తప్ప, డబ్బుకు కాదు కదా!