స్టార్ తమిళ్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 'తమిళగ వెట్రి కళగం' పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేయబోతున్నట్లు ప్రకటించారు. మరో రెండు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రజల అకాంక్ష నెరవేర్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామన్నారు. అవినీతి నిర్మూలనే తన లక్ష్యమన్నారు. కాగా ఇప్పటికే విజయ్ పార్టీ-బీజేపీ మధ్య తెరవెనుక పొత్తు ఉంటుందని, కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం విజయ్, ఆయన అభిమాన సంఘాలు పనిచేసేలా ఒప్పందం ఉందని వార్తలు వస్తున్నాయి.
తమిళ నాట రజనీకాంత్ తర్వాత విజయ్‌కే ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఇప్పటికే తమిళ రాజకీయాల్లోకి యంజీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, కెప్టెన్ విజయ్‌కాంత్, కమల్ హాసన్ లాంటి సినీ ప్రముఖులు ఉన్న జాబితాలోకి విజయ్ ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా రాజకీయ ఎంట్రీ అని ప్రకటించి తర్వాత రాజకీయాలు తనకు సరిపోవని దూరంగా జరిగిన విషయం తెలిసిందే.