టికెట్లు దక్కకుంటే ఏ పార్టీ నాయకులైనా పక్క చూపులు చూడడం సహజం. ఎమ్మెల్యే లేదా ఎంపీగా అధికార దర్పాన్ని అనుభవించి, ఒక్కసారిగా దూరం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. ఏదో ఒక పార్టీలో చేరి టికెట్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీలో అభ్యర్థుల ఎంపిక తీవ్ర చర్చనీయాంశమైంది. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ పరంపరలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీ మార్పుపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ దఫా ఆయనకు టికెట్‌ను వైసీపీ నిరాకరించింది. ఆయన సామాజిక వర్గానికే చెందిన నారాయణ యాదవ్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో బుర్రా మధుసూదన్ యాదవ్ జనసేనలో చేరతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.
తనపై సాగుతున్న ప్రచారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడే ప్రశ్నే లేదన్నారు. పార్టీ మారుతున్నట్టు కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనను ఎమ్మెల్యే చేసి రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ అని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. జీవితాంతం వైఎస్ జగన్‌తోనే వుంటానని ఆయన స్పష్టం చేయడం విశేషం.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తన ఆరాధ్య దైవమని, వైఎస్ జగన్ రాజకీయ దైవమని ఆయన అన్నారు. అయితే టికెట్ దక్కకపోవడంతో కొంత బాధపడ్డ మాట నిజమే అన్నారు. కొత్త ఇన్‌చార్జ్ నారాయణ యాదవ్‌కు మద్దతు ఇస్తానని, కనిగిరిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.