మంత్రి ఆర్కే రోజా రానున్న ఎన్నికల్లో పోటీపై మనసులో మాట బయట పెట్టారు. నగరి నుంచి హ్యాట్రిక్ కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేయడం విశేషం. నగరిలో రోజా పోటీపై రకరకాల ప్రచారం జరుగుతోంది. సర్వే నివేదికల్లో రోజాకు వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో రోజాకు ఈ దఫా టికెట్ ఇవ్వరనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రోజా మాత్రం నగరి టికెట్ తనదే అని ప్రకటించుకున్నారు. ఇవాళ ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరి నుంచి పోటీ చేస్తానన్నారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఆమె ధీమాగా చెప్పారు. వైసీపీలో మహిళా ఫైర్ బ్రాండ్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఈగ వాలనివ్వరు. ఎవరైనా సీఎం జగన్‌పై విమర్శలు చేస్తే, వారిపై రోజా విరుచుకుపడుతుంటారు. చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై విమర్శలు చేయడంలో రోజా ముందు వరుసలో వుంటారు. అయితే సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకులున్నారు. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ నేతల నోళ్లు మూయించగలుగుతున్నప్పటికీ, సొంత పార్టీ నేతల వెన్నుపోటు రాజకీయాలను ఆమె తిప్పి కొట్టలేకపోతున్నారు.
నగరిలో రోజాకు తెలియకుండానే వైసీపీ నేతలకు పదవులు, పనులు జరిగిపోతున్నాయి. ఇదేమని ప్రశ్నించలేదని నిస్సహాయ స్థితిలో రోజా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రోజాను ఓడించడానికి ఆమె వ్యతిరేకులు ఆర్థికంగా బలపడేందుకు అన్ని రకాలుగా పార్టీ, ప్రభుత్వం నుంచే సహాయ సహకారాలు అందించడం విశేషం. ఇప్పటికైనా రోజా సొంతింటిని చక్కదిద్దుకుంటే మంచిది.