టీడీపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మొట్టమొదటగా ప్రకటించిన అభ్యర్థికి… ఎన్నికల సమయానికి వచ్చే సరికి టికెట్ నిరాకరించే పరిస్థితి ఉత్పన్నం కావడం చర్చనీయాంశమైంది.
డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు రెండు మూడేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. డోన్‌లో సుబ్బారెడ్డిని గెలిపించాలని ఆ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీంతో డోన్‌లో ప్రతి గడపా తొక్కుతూ ప్రజాదరణ పొందేందుకు సుబ్బారెడ్డి తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేశారు.
ఇదిలా వుండగా డోన్ టికెట్ సుబ్బారెడ్డికి లేదని చావు కబురు చల్లగా టీడీపీ నేతలు చెబుతున్నారు. డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం లీకులు ఇస్తోంది. సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సర్ది చెప్పి, కోట్ల కుటుంబానికి సహకరించేలా పార్టీ ఒప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది. డోన్‌లో సుబ్బారెడ్డిని నిలిపితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని కేఈ కుటుంబం తేల్చి చెప్పింది.
డోన్‌లో కేఈ కుటుంబ మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యం. కోట్ల కుటుంబానికైతే సహకరిస్తామని కేఈ కుటుంబం చెప్పడంతో, టీడీపీ వారినే బరిలో దింపేందుకు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబు తన నైజానికి విరుద్ధంగా ఎంతో ముందుగా తనకు టికెట్ ప్రకటించారని, దీంతో ఊరూరా వర్గాన్ని కాపాడుకునేందుకు సుబ్బారెడ్డి భారీ మొత్తంలో ఖర్చు కూడా పెట్టారు. తీరా ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడంతో సుబ్బారెడ్డికి ఏం చేయాలో తోచడం లేదు.
అవమానాన్ని దిగమింగి టీడీపీలోనే కొనసాగడమా? లేక ఎదురు తిరిగి బరిలో నిలవడమా?… ఈ రెండు మాత్రమే ఆయన ఎదుట ఉన్నాయి. దేన్ని ఎంచుకుంటారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.