రాజకీయాల్లో వారసుల భవిష్యత్‌పై ఆలోచించడం కొత్తేమీ కాదు. అయితే రాజకీయ ప్రవేశానికి వారసత్వం పనికొస్తుందే తప్ప, ఎదుగుదలకు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన వారసుడు విజయ్‌కి మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సానుకూల స్పందన కనిపించడం లేదు.
తన కుమారుడు చింతకాయల విజయ్‌కి అనకాపల్లి పార్లమెంట్ టికెట్ అడిగినట్టు అయ్యన్నపాత్రుడు ఇటీవల చెప్పారు. ఈ మేరకు పార్టీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అయితే విజయ్‌కి అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబునాయుడు, లోకేశ్ సిద్ధంగా లేరని తెలిసింది. అనకాపల్లి ఎంపీ టికెట్‌ను బైరి దిలీప్ చక్రవర్తికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో విజయ్‌కి ఎన్నికల్లో పోటీ చేసే దారి దాదాపు మూసుకుపోయినట్టే.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ మాత్రమే ఇవ్వనున్నారు. ఇంతకు మించి ఆయన కుమారుడికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం ఏ మాత్రం సముఖంగా లేదని సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అయ్యన్నపాత్రుడు ఆశిస్తున్నారు. అయితే చింతకాయల విజయ్ వ్యవహార శైలిపై చంద్రబాబు, లోకేశ్ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అందుకే ఆయన్ను సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ లాంటి ముఖ్య నాయకులు ఫోన్ చేసినా విజయ్ అందుబాటులోకి రావడం లేదనే కోపం పార్టీ పెద్దల్లో వుంది. ఇలాగైతే రాజకీయాలు ఎలా చేస్తారనే ప్రశ్న విజయ్ విషయంలో ఉత్పన్నమవుతోంది.
విజయ్‌ని ఒక ప్రజాప్రతినిధిగా చూడాలనే తపన కన్న తండ్రిగా అయ్యన్నపాత్రుడికి ఉన్నప్పటికీ, ఆ యువ నాయకుడిని సోమరితనం వెంటాడుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో బంగారు భవిష్యత్‌ను చేజేతులా జారవిడుచుకుంటున్నాడనే ఆవేదన అయ్యన్నపాత్రుడి అనుచరుల్లో వుంది. అయ్యన్నతోనే ఆయన కుటుంబ రాజకీయానికి తెరపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.