జ‌న‌సేన‌తో ఎల్లో మీడియా మైండ్ గేమ్‌!

ఎల్లో మీడియా ల‌క్ష్యం చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు. బాబుకు రాజ‌కీయంగా దెబ్బ త‌గులుతుందంటే ఎలాంటి నిజాన్నైనా దాచి పెట్ట‌డానికి ఆ మీడియా వెనుకాడ‌దు. అలాగే టీడీపీకి లాభం క‌లిగించేందుకు ఇత‌ర పార్టీల‌పై విషం చిమ్మ‌డానికి…

ఎల్లో మీడియా ల‌క్ష్యం చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు. బాబుకు రాజ‌కీయంగా దెబ్బ త‌గులుతుందంటే ఎలాంటి నిజాన్నైనా దాచి పెట్ట‌డానికి ఆ మీడియా వెనుకాడ‌దు. అలాగే టీడీపీకి లాభం క‌లిగించేందుకు ఇత‌ర పార్టీల‌పై విషం చిమ్మ‌డానికి ఎల్లో మీడియా వెనుకాడ‌దు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌త్య‌ర్థుల‌ను కాదే, మిత్రుల‌ను కూడా అవ‌స‌ర‌మైతే టార్గెట్ చేయ‌డానికి ఆ మీడియా రెండో ఆలోచ‌న చేయ‌దు.

తాజాగా జ‌న‌సేన‌తో ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోంది. టీడీపీ, జ‌న‌సేన పొత్తులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ రెండు పార్టీల సీట్ల పంపిణీ ఉత్కంఠ రేపుతోంది. పొత్తు ధ‌ర్మాన్ని పాటించ‌కుండా చంద్ర‌బాబు ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించార‌ని ఆగ్ర‌హావేశానికి గురైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… తన‌పై కూడా ఒత్తిడి వుందంటూ జ‌న‌సేన పోటీ చేసే రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఆ రెండు పార్టీల పొత్తుపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు.

బ‌హిరంగంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే జ‌న‌సేన నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని గ్ర‌హించిన టీడీపీ, ప‌రోక్షంగా త‌న మీడియాని అడ్డుపెట్టుకుని స‌రికొత్త ఆట ఆడేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా అభ్య‌ర్థుల వివ‌రాల‌కు సంబంధించి త‌న మీడియా ద్వారా వెల్ల‌డించ‌డానికి టీడీపీ వ్యూహం ప‌న్నింది. జ‌న‌సేనకు మూడు పార్ల‌మెంట్ స్థానాల‌కు మించి ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని టీడీపీ త‌న మీడియా ద్వారా చెప్ప‌క‌నే చెప్పింది.

తాజాగా ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ఎల్లో మీడియా ప్ర‌క‌టించింది. అన‌ధికార‌మంటూనే అభ్య‌ర్థుల‌ను ఆ మీడియానే ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే జ‌న‌సేన‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అభ్య‌ర్థులు లేర‌ని టీడీపీనే భావించి, త‌న‌కు తానుగా త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో 9 చోట్ల అభ్య‌ర్థులు ఖ‌రారైన‌ట్టు టీడీపీ ప‌రోక్షంగా వివ‌రాలు వెల్ల‌డించింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఐదు స్థానాల్లో క‌స‌ర‌త్తు ఇంకా పూర్తి కానట్టు పేర్కొన్నారు. వీటిలో జ‌న‌సేన‌కు ఒక్క‌టంటే ఒక్క చోట కూడా చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదేమ‌య్యా అంటే… ఆ పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేర‌ని ఎల్లో మీడియా ద్వారా జ‌న‌సేన‌కు స‌మాధానం కూడా ఇస్తున్నారు.

ఇవ‌న్నీ చంద్ర‌బాబు వ్యూహంలో భాగంగానే త‌మ‌తో మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని గ్ర‌హించక‌పోతే జ‌న‌సేన‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు.  ప్ర‌స్తుతం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు మొద‌లైంది. టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చోట మాన‌సికంగా జ‌న‌సేన‌ను సిద్ధం చేసేందుకు టీడీపీ త‌న మీడియా ద్వారా ఇలాంటి మైండ్ గేమ్ ఆడ‌నుంది. క‌ర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా ఇచ్చేది లేద‌ని టీడీపీ చెప్ప‌క‌నే చెప్పింది. ఇలాంటి క‌థ‌నాల వెనుక మ‌ర్మాన్ని అర్థం చేసుకుని జ‌న‌సేన కూడా గేమ్ ఆడితేనే, క‌నీసం ప‌ది, పాతికో సీట్ల‌ను ద‌క్కించుకుంటుంది. లేదంటే టీడీపీ భిక్ష‌, జ‌న‌సేన ప్రాప్తం అన్న‌ట్టుగా త‌యార‌వుతుంది.